గాలికి వదిలేశారు..!

ABN , First Publish Date - 2021-05-02T05:39:30+05:30 IST

ఆదోనిలో ఓ వలంటీర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా హోం ఐసొలేషన్‌లో ఉండకుండా బయట తిరిగాడు.

గాలికి వదిలేశారు..!

  1. తూతూ మంత్రంగా కరోనా కట్టడి చర్యలు
  2. ప్రైమరీ, సెకెండరీ కాంటాక్ట్‌లను గుర్తించని అధికారులు
  3. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి అందని మెడికల్‌ కిట్లు
  4. పాజిటివ్‌ కేసుల ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలూ లేవు
  5. జిల్లా యంత్రాంగం తీరుతో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు


కర్నూలు, ఆంధ్రజ్యోతి:  

ఆదోనిలో ఓ వలంటీర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా హోం ఐసొలేషన్‌లో ఉండకుండా బయట తిరిగాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల ప్రజలు గుర్తించి ఫిర్యాదు చేసేవరకు అధికారులు పట్టించుకోలేదు.


కర్నూలు కొత్తపేటలోని ఓ కాలనీలో 12 మంది కొవిడ్‌ బాధితులు ఉన్నట్లు సమాచారం. వీరంతా హోం ఐసొలేషన్‌ పాటించకుండా బయట తిరుగుతున్నారు. వీరికి ఏఎన్‌ఎంలు ఎలాంటి ఐసొలేషన్‌ కిట్లు అందజేయలేదు. ఆ ప్రాంతాన్ని శానిటైజ్‌ చేయించలేదని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.



జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు ఇవి. మొదటి వేవ్‌ను జిల్లాలో సమర్థవంతంగా నిర్మూలించి, దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నామని, సెకండ్‌ వేవ్‌ను కూడా అంతే సమర్థవంతంగా ఎదుర్కొంటామని జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా ప్రకటించుకుంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే డొల్లతనం బయటపడుతుంది. జిల్లాలో నెల వ్యవధిలో 12 వేల కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 8 వేల వరకు యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. బాధితుల్లో చాలామంది యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. వైద్యాధికారులు, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు తప్ప, హోం ఐసొలేషన్‌లో ఉన్న వారిలో దాదాపు 30 శాతం మంది బయట తిరుగుతున్నారని సమాచారం. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించడంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగాను వ్యవహరిస్తున్నారు. వీరంతా ఎక్కడ ఉన్నారన్న  సమాచారం కూడా లేదు. రాత్రి కర్ఫ్యూ, పాక్షిక లాక్‌డౌన్‌, స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అని చెబుతూ అధికార యంత్రాంగం చేతులు దులుపుకుంటోంది. మొదటి వేవ్‌లో కఠిన చర్యలు తీసుకున్నా, ఒకానొక దశలో దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాగా కర్నూలు రికార్డులకెక్కింది.


ట్రేసింగ్‌ ఎక్కడ?
కరోనా కట్టడిలో 3 టీలు (ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌) ముఖ్యమని వైద్యులు, నిపుణులు చెబుతుంటారు. అధికారులు జిల్లాలో ట్రేసింగ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో దగ్గరగా మెలిగిన వారిని ప్రైమరీ కాంటాక్టులుగా, వీరితో సన్నిహితంగా మెలిగిన వారిని సెకండరీ కాంటాక్ట్‌లుగా గుర్తిస్తారు. వారికి కూడా కరోనా పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ మరింత ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చు. కానీ వీరు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకుంటే తప్ప ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల గురించి అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.  అదేమని వైద్యాధికారులను అడిగితే, కాంటాక్టులే ముందు కు రావడం లేదని అంటున్నారు. పాజిటివ్‌ బాధితుల్లో కూడా చాలామంది స్వచ్ఛందంగా టెస్టులు చేయించుకున్నవారే తప్ప అధికార యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏమీ లేవు. గతంలో కరోనా టెస్టులు చేయడానికి క్యాంపులు నిర్వహించేవారు. ప్రస్తుతం వాటి ఊసే లేదు.


శానిటేషన్‌ మరిచిపోయారు
పాజిటివ్‌ కేసు నమోదైన ఇంటిని, పరిసర ప్రాంతాలను హైపోక్లోరైడ్‌ ద్రావణంలో శానిటైజ్‌ చేసేవారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టేవారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యేవారు. కరోనా సోకకుండా ఎవరికి వారు చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలేవీ లేవు. పైగా పాజిటివ్‌ కేసులు విషయంలో అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఏ ప్రాంతంలో, ఏ వీధిలో ఎన్ని కేసులు నమోదవు తున్నాయన్న విషయాన్ని చెప్పకుండా దాస్తున్నారు. దీంతో ఇంటి పక్కన వారికి కరోనా వచ్చినా చుట్టూ ఉండే వారికి తెలియడం లేదు. బాధితుల మీద ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయలేదు. ఇదే అదనుగా చాలామంది హోం ఐసొలేషన్‌లో ఉండటం లేదు. సాధారణ ప్రజల్లా బయట తిరిగేస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు గుర్తించి తెలియజేసే వరకు అధికారుల మత్తు వదలడం లేదు.

హోం ఐసొలేషన్‌ కిట్లు లేవు
జిల్లాలో 8 వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 5 వేల మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. బాధితులకు ప్రభుత్వం హోం ఐసోలేషన్‌ కిట్లు అందించాల్సి ఉంటుంది. కానీ వైద్య ఆరోగ్య శాఖ సక్రమంగా కిట్లను పంపిణీ చేయడం లేదు. జాగ్రత్తలు చెప్పాల్సిన వలంటీర్లు, ఏఎన్‌ఎంలు బాధితులను పట్టించుకోవడం మానేశారు. టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే వలంటీర్లు, ఏఎన్‌ఎంలు బాధితులకు ఫోన్‌చేసి ‘మీరు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. జాగ్రత్తగా ఉండండి’ అని మాత్రం చెబుతున్నారు. ప్రభుత్వం అందించాల్సిన కిట్లు అందక, పర్యవేక్షించాల్సిన వారు లేకపోవడంతో బాధితులే స్వయంగా మందులు, నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు. ఈ కారణంగా కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.




Updated Date - 2021-05-02T05:39:30+05:30 IST