శ్రీగిరిపై లక్ష దీపోత్సవం

ABN , First Publish Date - 2021-11-09T05:55:16+05:30 IST

కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం నిర్వహించింది.

శ్రీగిరిపై లక్ష దీపోత్సవం

  1.  పుష్కరిణికి దశవిధ హారతులు


శ్రీశైలం, నవంబరు 8: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో లోక కల్యాణం కోసం పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం నిర్వహించింది. పుష్కరిణికి దశవిధ హారతులు సమర్పించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి విశేషంగా పూజలు జరిపారు. అనంతరం పుష్కరిణికి హారతులు సమర్పించారు. లక్ష దీపోత్సవంలో భాగంగా పుష్కరిణి ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీగిరి క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. దర్శనం క్యూలైన్లు, ఆలయ ప్రధాన వీధులు కిక్కిరిశాయి. 


దీపాల వెలుగులు


ఆలయ ఉత్తర మాడవీధి, గంగాధర మండపం వద్ద భక్తులు దీపాలను వెలిగించారు. దేవస్థానం అర్చకులు సాయంత్రం ఆకాశ దీపం వెలిగించారు. సంకల్పాన్ని పఠించి, గణపతి పూజ నిర్వహించిన అనంతరం ఆకాశ దీప ప్రజ్వలన, దీపారాధన చేశారు. దేవస్థానంలో అఖండ శివ భజనలు కొనసాగుతున్నాయి. క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, అల్పాహారం అందజేస్తున్నారు. దర్శనానంతరం భక్తులకు అన్నదాన భవనంలో అన్నప్రసాదం అందజేస్తున్నారు. 


భక్తులందరికీ సంతృప్తికర దర్శనం


  1. అందుకే స్పర్శ దర్శనం నిలుపుదల
  2. శ్రీగిరిపై వైభవంగా కార్తీక మాసోత్సవాలు


శ్రీశైలం, నవ ంబరు 8: కార్తీక మాసోత్సవాలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలంలో స్వామివారి స్పర్శ దర్శనాన్ని దేవస్థానం అధికారులు రద్దు చేశారు. ఈ నెల 5 నుంచి డిసెంబరు 4 వరకు దేవస్థానం కార్తీక మాసోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మాసంలో క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. భక్తులందరికీ స్వామి అమ్మవార్ల దర్శనం సంతృప్తికరంగా కల్పించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయంలో అభిషేకాలను అధికారులు నిలుపుదల చేశారు. స్వామివారి స్పర్శ దర్శనం కల్పించడం వల్ల 15 శాతం మంది భక్తులకు మాత్రమే సంతృప్తి కలుగుతుందని, మిగిలిన 85 శాతం మందికి ఇబ్బంది కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. అందుకే భక్తులందరి కోసం స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిలుపుదల చేశామని వెల్లడించారు. గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేసినా సామూహిక అభిషేకాలను నాలుగు విడతలుగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఆర్జిత హోమాలు రెండు విడతలుగా, సుబ్రహ్మణ్యస్వామి అమ్మవార్ల కల్యాణం, భ్రమరాంబ మల్లికార్జునుల కల్యాణం యథావిధిగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం రోజున ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సామూహిక అభిషేకాలలో 594 మంది, కుంకుమార్చన - 252, చండీయాగం - 40, రుద్రయాగం - 25, కల్యాణం -81, శాశ్వత కల్యాణంలో 60 మంది భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T05:55:16+05:30 IST