కేఎస్ కేర్ హాస్పిటల్ ఎండీ అరెస్టు
ABN , First Publish Date - 2021-05-09T04:58:15+05:30 IST
కరోనా బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి మృతికి కారణమైన కేఎస్ కేర్ హాస్పిటల్ యజమాన్యాన్ని నాలుగో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

కర్నూలు, మే 8: కరోనా బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి మృతికి కారణమైన కేఎస్ కేర్ హాస్పిటల్ యజమాన్యాన్ని నాలుగో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 1న కొత్తబస్టాండు సమీపంలో ఉన్న కేఎస్ కేర్ హాస్పిటల్‌లో కొంత మంది కరోనా రోగులు మృతి చెందారు. వారికి సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆక్సిజన్, ఇంజెక్షన్లు సమకూర్చలేదని విచారణలో తేలిందని పేర్కొన్నారు. దీనికితోడు రోగుల వద్ద ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేశారని తెలిపారు. డీఎంహెచ్‌వో కార్యాలయ అనుమతి తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారని, వీరి నిర్లక్ష్యం వల్లనే కడపకు చెందిన షేక్ జైనాబీ, షేక్ మహమ్మద్ రవూఫ్, నందవరంకు చెందిన హంపమ్మ, మద్దిలేటిలు మృతి చెందారని సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా స్థాయి అధికారి డా.నాగప్రసాద్‌బాబు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు దర్యాప్తు చేశామని తెలిపారు. ఎస్‌ఐ చిరంజీవి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు సాగిందన్నారు. ఈ కేసులో భాగంగా ఆసుపత్రి ఎండీ బంగీలాల్ బహదూర్ శాస్త్రిని శనివారం అరెస్టు చేశామన్నారు. మృతి చెందిన వారి కేస్‌షీట్లు, ఆసుపత్రి యజమాన్య సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఆసుపత్రి డైరెక్టర్ నరసింహులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.