కొవిడ్‌ వారియర్స్‌ ఆందోళన

ABN , First Publish Date - 2021-10-19T05:48:38+05:30 IST

తమను విధుల్లో కొనసాగించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కొవిడ్‌ వారియర్స్‌ ఆందోళన చేశారు.

కొవిడ్‌ వారియర్స్‌ ఆందోళన
కలెక్టరేట్‌ గేట్లు ఎక్కిన కొవిడ్‌ వారియర్స్‌

  1. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నం
  2. అడ్డుకున్న పోలీసులు.. ఇరువురి మధ్య తోపులాట


కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 18: తమను విధుల్లో కొనసాగించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కొవిడ్‌ వారియర్స్‌ ఆందోళన చేశారు. ఏపీ మెడికల్‌ కొవిడ్‌ వారియర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్‌ వరకు కొవిడ్‌ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేశారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అమర్‌, ఏఐటీయూసీ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్ళేందుకు యత్నించారు. కొందరు నాయకులు కలెక్టరేట్‌ గేట్లు ఎక్కడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఏఐటీయూసీ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 600 మంది కొవిడ్‌ వారియర్స్‌ పని చేస్తున్నారన్నారు. మొదటి దశలో గానీ, రెండో దశలో గానీ కాలపరిమితి కాకముందే వారిని తొలగించారన్నారు. వీరికి గతంలో పని చేసిన జీతాలు కూడా చెల్లించలేదన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి విధుల్లో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం వైద్యఆరోగ్యశాఖలో విడుదలైన నోటిఫికేషన్‌లో ఎన్‌హెచ్‌ఎం, యుపీహెచ్‌సీ పోస్టుల భర్తీలో కొవిడ్‌ వారియర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-10-19T05:48:38+05:30 IST