సాహిత్యంలో ఆధునికతకు ప్రతినిధి కేఎన్‌ఎస్‌ రాజు

ABN , First Publish Date - 2021-03-22T05:18:04+05:30 IST

జిల్లాలో ఆధునిక సాహిత్యానికి ప్రతినిధి దివంగత కేఎన్‌ఎస్‌ రాజు అని సీనియర్‌ కవి, రచయిత శిష్ణు కృష్ణమూర్తి కొనియాడారు.

సాహిత్యంలో ఆధునికతకు ప్రతినిధి కేఎన్‌ఎస్‌ రాజు

  1. సీనియర్‌ కవి, రచయిత శిష్టు కృష్ణమూర్తి


కర్నూలు (కల్చరల్‌), మార్చి 21: జిల్లాలో ఆధునిక సాహిత్యానికి ప్రతినిధి దివంగత కేఎన్‌ఎస్‌ రాజు అని సీనియర్‌ కవి, రచయిత శిష్ణు కృష్ణమూర్తి కొనియాడారు. ఇటీవల మృతిచెందిన కర్నూలుకు చెందిన సీనియర్‌ రచయిత, మాజీ కో ఆపరేటివ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కేఎన్‌ఎస్‌ రాజు సంస్మరణ సభ ఆదివారం రాత్రి టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించారు.  పలువురు కవులు, రచయితలు, కళాకారులు కేఎన్‌ఎస్‌ రాజు చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ 1972లో జిల్లా రచయితల సహకార సంఘం ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షులుగా వ్యవహరించిన రాజు ఎందరో రచయితల పుస్తకాలను వెలుగులోకి తీసుకువచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయన తన రచనల ద్వారా జిల్లా సాహిత్యంలో ఆఽధునిక విలువలకు పట్టం కట్టారని అన్నారు. రచయిత ఎస్‌డీవీ అజీజ్‌ మాట్లాడుతూ కేఎన్‌ఎస్‌ రాజు పాత, కొత్త తరాలకు చెందిన రచయితలను ప్రోత్సహించారని అన్నారు. జేఎస్‌ఆర్‌కే శర్మ మాట్లాడుతూ కేఎన్‌ఎస్‌ రాజు నిరాడంబరంగా జీవించారని అన్నారు. సాహిత్య పరిశోధకుడు వైద్యం వెంకటేశ్వరాచార్యులు మాట్లాడుతూ రాజు ప్రేరణతోనే తాను జిల్లా కవుల చరిత్ర రాశానని అన్నారు. బాలసాహిత్య రచయిత డాక్టర్‌ హరికిషన్‌ మాట్లాడుతూ సామాజిక సమస్యల నేపథ్యంలో రాజు  నవలలు, కథలు రాశారని అన్నారు.  టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కవులు జంధ్యాల రఘుబాబు, వెంకటకృష్ణ, కేఎన్‌ఎస్‌ రాజు కుటుంబ సభ్యులు సురేశ్‌, జయంతి, సుభాషిణి  పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:18:04+05:30 IST