శ్రీగిరిపై కార్తీక మాసోత్సవాలు

ABN , First Publish Date - 2021-11-02T06:08:32+05:30 IST

కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీశైలం దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

శ్రీగిరిపై కార్తీక మాసోత్సవాలు
ఆలయ ఉత్తర మాడ వీధులను పరిశీలిస్తున్న ఈవో ఎస్‌ లవన్న, అధికారులు

  1. 5 నుంచి డిసెంబరు 4 వరకు వేడుకలు
  2. ఏర్పాట్లను పరిశీలించిన దేవస్థానం ఈవో
  3. స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలు రద్దు


శ్రీశైలం, నవంబరు 1: కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీశైలం దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 5 నుంచి డిసెంబరు 4 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దేవస్థానం అధికారులతో కలసి ఈవో ఎస్‌.లవన్న పుష్కరిణి ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, హారతి కార్యక్రమాలను శాస్త్రోక్తకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణి వద్ద స్వామి అమ్మవార్లను ఆశీనులను జేసి, పూజా కార్యక్రమాలను నిర్వహించే వేదికను విశాలంగా ఏర్పాటు చేయాలని అన్నారు. పుష్కరిణి వద్ద ప్రమిదలను క్రమబద్ధంగా ఏర్పాటు చేయాలని, పుష్కరిణి ప్రాంతాన్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. కార్తీక మాసంలో భక్తుల దీపారాధనకు వీలుగా ఆలయ ఉత్తర మాఢవీధిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కుండీలలో ఉసిరి చెట్లను ఏర్పాటు చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఈవో ఆదేశించారు. 


ఏర్పాట్లపై సమీక్ష


కార్తీక మాసం ఏర్పాట్ల గురించి తన పరిపాలన భవనంలోని ప్రధాన అర్చకులు, పరిపాలన, పారిశుధ్య, ప్రచురణ తదితర విభాగాల వారితో ఈవో సమీక్ష నిర్వహించారు. ప్రజాసంబంధాల అధికారి, వసతి, గణాంకాల విభాగ పర్యవేక్షకులు, ముఖ్య భద్రతాధికారి, సిస్టం అడ్మినిస్ర్టేటర్‌ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాట్లు, ఆర్జిత సేవల గురించి చర్చించారు. అందరి ఏకాభిప్రాయం మేరకే కార్తీక మాసంలో గర్భాలయాల్లో అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనం నిలిపివేశామని ఈవో తెలిపారు. కొవిడ్‌ నివారణ చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.


 కార్తీక మాసంలో స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తామని, భక్తులు సహకరించాలని ఈవో కోరారు.                               

Updated Date - 2021-11-02T06:08:32+05:30 IST