అనర్హులకు ఉద్యోగాలా..?
ABN , First Publish Date - 2021-10-21T05:24:40+05:30 IST
రాయలసీమ యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికెట్ల వివాదం దుమారం రేపుతోంది. 2018లో 102 మంది కాంట్రాక్టు ఉద్యోగులను టైంస్కేల్ ఉద్యోగులుగా అడ్డగోలుగా నియమించారని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

టైంస్కేల్ నియామకాలలో అక్రమాలు
నిబంధనలకు విరుద్ధంగా అలవెన్సులు
జీవోలు పాటించని ఆర్యూ అధికారులు
భగ్గుమంటున్న విద్యార్థి, యువజన జేఏసీ
గవర్నర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం
కర్నూలు(అర్బన), అక్టోబరు 20: రాయలసీమ యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికెట్ల వివాదం దుమారం రేపుతోంది. 2018లో 102 మంది కాంట్రాక్టు ఉద్యోగులను టైంస్కేల్ ఉద్యోగులుగా అడ్డగోలుగా నియమించారని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆందోళనలు ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటి అధికారులు ఒక కమిటీని వేసి, నివేదిక ఆధారంగా వారిని టైం స్కేల్ ఉద్యోగులుగా గుర్తించారు. ఆ సమయంలో చాలా మంది ఉద్యోగులు వర్సిటీ అధికా రులకు ముడుపులు చెల్లించి ఉద్యోగాలు పొందారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అధారాలు లేకపోవడంతో కనుమరుగైన ఈ వ్యవహారం ప్రస్తుతం బీటెక్ విద్యార్థులను సస్పెండ్ చేయడంతో రాజుకుంది. విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు నాటి అక్రమాలను ఆధారాలతో బయట పెట్టారు. ఆధారాలను చూసిన ఉన్నత విద్యాశాఖ అధికారులు అవాక్కయ్యారు. అప్పటి కమిటీ సభ్యులుగా ఉన్న కొందరు ప్రొఫెసర్లు ఉద్యోగులతో చేతులు కలిపి రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక పంపారని విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు ఉచ్చు బిగుసుకుంటోందని భావించిన ఓ ఫ్రొఫెసర్.. విద్యార్థి నాయకులతో చర్చలకు దిగినట్లు సమాచారం. ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉద్యోగులను టైం స్కేల్ ఉద్యోగులుగా ఎంపిక చేసిన విషయమై ఫిర్యాదులు రావడంతో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర ఆర్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆర్యూలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు విద్యార్థి, యువజన సంఘాలు ఆపాయింట్మెంట్ కోరాయి. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన ఓ మంత్రికి విద్యార్థి నాయకులు నివేదించారు. వీటికి సంబంధించిన ఆఽధారాలు సేకరించారని, మరింత సమాచారం ఇవ్వాలని మంత్రి కోరినట్లు తెలిసింది.
విద్యార్థి సంఘాలు చూపుతున్న ఆధారాలు
- రూల్ ఆఫ్ రిజర్వేషన పాటించకుండా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేశారు.
- 102 మంది ఉద్యోగుల్లో ఏ ఒక్కరికీ కాంట్రాక్టు ఉద్యోగిగా నోట్ ఆర్డర్ లేదు.
- జనవరి 1వ తేదీ, ఆదివారాలు, రెండో శనివారాలలో ఉద్యోగాలలో చేరినట్లు (డేట్ ఆఫ్ జాయినింగ్) రికార్డుల్లో చూపించారు. ప్రభుత్వ వెబ్సైట్లో, సీఎఫ్ఎంఎస్ డేటాలో ఈ వివరాలు ఉన్నాయి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓ ఉద్యోగి 5 సంవత్సరాలు ఒకే క్యాడర్లో పని చేయాల్సి ఉంది. కానీ ఏ ఒక్కరూ ఐదేళ్లు ఒకే క్యాడర్లో పని చేయకుండానే టైంస్కేల్గా పదోన్నతులు పొందారు.
- 60 సంవత్సరాలు పైబడిన 20 మంది ఉద్యోగులను ఆఽధార్ కార్డులో మార్పులు చేసి టైంస్కేల్ చేశారు.
- కొందరికి విద్యార్హతలు లేకున్నా టైం స్కేల్ ఉద్యోగులుగా మార్చారు.
- మరికొందరు ఉద్యోగులకు నకిలీ సర్టిఫికెట్లు పెట్టి పదోన్నతులు ఇచ్చారు.
- కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ చేయకూడదని, టైం స్కేల్ ఉద్యోగులకు హెచఆర్ఏ, ఐఆర్ఏ ఇవ్వకూడదని ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. యూనివర్సిటీ అఽధికారులు ఈ నిబంధనలను పట్టించుకోకుండా హెచఆర్ఏ, ఐఆర్ఏ వర్తింపజేస్తున్నారు. ఈ విషయాన్ని రికార్డుల్లో చూపిస్తున్నారు.
వేలిముద్ర వేసేవారికి ఉద్యోగాలా..?
రాయలసీమ యూనివర్సిటీలో వేలి ముద్రవేసేవారికి కీలక ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరి సొమ్మని వారికి నెలానెలా వేలకు వేలు జీతాలు ఇస్తున్నారు..? ఇదే యూనివర్సిటీలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు ఎంతోమంది ఉపాధి అవకాశాలు లేక రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. అక్రమ నియామకాలపై వెంటనే విచారించాలి. బాధ్యులకు జైలు శిక్ష విధించాలి. వర్సిటీలో జరిగిన అక్రమాలను వివరించేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరాం. గవర్నర్ను కలిసి అన్ని వివరిస్తాం. అక్రమార్కుల లెక్కలు తేల్చి యూనివర్సిటీని కాపాడుకుంటాం.
- శ్రీరాములు, కన్వీనర్, విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ
మంత్రి బుగ్గనకు ఫిర్యాదు చేశాం..
ఆర్యూలో జరుగుతున్న అక్రమాలు, అక్రమ నియాకమాలపై ఆధారాలతో రాష్ట్ర అర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథఽరెడ్డికి ఫిర్యాదు చేశాం. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాం. అక్రమంగా ఉద్యోగాలు పొంది తిష్ఠ వేసినవారిని తొలగించి, కొత్తగా అర్హులను నియమించాలని, యూనివర్సిటీలో పాలనను గాడిలో పెట్టాలని కోరాం.
- గౌతమ్, జిల్లా అధ్యక్షుడు, వైసీపీ విద్యార్థి విభాగం
ఫిర్యాదు రాలేదు
అక్రమ నియామకాలు జరిగాయని మాకు ఏలాంటి ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదులు వస్తే ఉపకులపతి దృష్టికి తీసుకెళ్తాం. ఏం చేయాలనే దానిపై చర్చిస్తాం.
- మధుసూదన వర్మ, రిజిసా్ట్రర్, ఆర్యూ