జగనన్నా.. కాలనీ ఎక్కడ!

ABN , First Publish Date - 2021-12-20T05:02:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల పథకం నీరుగారుతోంది.

జగనన్నా.. కాలనీ ఎక్కడ!
ఇటీవల కురిసిన వర్షాలకు జూటూరులోని ఊటవాగు పొంగి నీట మునిగిన జగనన్న కాలనీ

  1. గ్రామాలకు దూరంగా  జగనన్న కాలనీలు
  2. ఇంటి నిర్మాణాలకు  ముందుకు రాని లబ్ధిదారులు 
  3. అటకెక్కిన జగనన్న పథకం

పాములపాడు డిసెంబరు 19 :  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల పథకం నీరుగారుతోంది. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి,  ఇంటి తాళాలను లబ్ధిదారులకు ఇస్తామని చెప్పడంతో దాదాపు 80 శాతం మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గ్రామాల్లో నివాసయోగ్యం కాని ప్రదేశాలల్లో ఇళ్ల స్థలాలను మంజూరు చేయడంతో ఈ స్థలాలు మాకొద్దు అంటూ లబ్ధిదారులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో నెలలు గడుస్తున్నా జగనన్న ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. మండలంలోని 12 పంచాయతీలలో 1514 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కేవలం 3 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌, 7 రూప్‌ లెవెల్‌, 67 బేస్‌ లెవెల్‌ దశలో ఉన్నాయి. ఎర్రగూడూరు, మిట్టకందాల, జూటూరు, క్రిష్ణారావుపేట, తుమ్మలూరు, గ్రామాల్లో ఊరికి దూరంగా నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో స్థలాలు కేటాయించారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఐదు గ్రామాలకు సంబంధించిన 185 మంది లబ్ధిదారులకు జూటూరు గ్రామ శివారులోని ఊటవాగును ఆనుకొని ఇంటి స్థలాలు కేటాయించారు. చిన్న పాటి వర్షాలకే వాగు పొంగి కాలనీలోకి నీరు చేరుతోంది. ఇక్కడ ఎలా ఇళ్లు నిర్మిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.  అయితే మొదట ప్రభుత్వమే నిర్మిస్తోందని చెప్పి, ఇప్పుడేమో మీరే కట్టించుకోండి.. సిమెంట్‌, ఐరనలతో పాటు ఇంటి బిల్లులు చెల్లిస్తామని, నిర్మాణాలకు డబ్బులు చాలకుంటే డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తామని అధికారులు చెబుతున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.   

Updated Date - 2021-12-20T05:02:08+05:30 IST