జగన్‌.. మౌనమెందుకు?

ABN , First Publish Date - 2021-07-08T05:55:22+05:30 IST

కృష్ణాజలాల వివాదంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాద్ధాంతం చేస్తోంటే సీఎం జగన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.

జగన్‌.. మౌనమెందుకు?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల

  1. కృష్ణా జలాల వివాదంపై సీఎం మాట్లాడాలి
  2. సీమ ప్రయోజనాల కోసం పోరాటం
  3. రెండేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం 
  4. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి 


పత్తికొండటౌన్‌, జూలై 7:   కృష్ణాజలాల వివాదంలో  తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాద్ధాంతం చేస్తోంటే సీఎం జగన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం పత్తికొండకు వచ్చిన ఆయన మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ప్రమోద్‌కుమార్‌రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాజలాల పంపకంపై జరిగిన ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని అన్నారు. తెలంగాణ చర్యల వల్ల శ్రీశైలంలో నీటి మట్టం పెరగడం లేదని, దీని వల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజలాలను వినియోగించుకోలేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని అన్నారు. కృష్ణాజలాల విషయంలో ఏపీకి, సీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్‌, మంత్రులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సీమ ప్రాంత బాగోగుల కోసం టీడీపీ పోరుకు సిద్ధమవుతుందని వెల్లడించారు. జిల్లాలో గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులు నిర్మిస్తే కర్నూలు జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందించవచ్చన్నారు. ఇలాంటి పనులు చేయకుండా అమ్మఒడి, చేయూత వంటి పథకాలతో సంక్షేమం అంటే ఇదే అని ప్రశ్నించారు. రెండేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా, మద్యం, జూదం, మట్కా లాంటివి అధికార పార్టీ నాయకుల కన్నుసన్నల్లో నడుస్తున్నాయని అన్నారు. పోలీసు శాఖ పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారి ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, పాల ఉత్పత్తి కేంద్రాలు, సచివాలయ నిర్మాణాలకు ప్రభుత్వం దమ్ముంటే భూములు కొనివ్వాలని అన్నారు. అంతేగాని ఎన్నో ఏళ్లుగా ప్రజలు వాడుకుంటున్న వాముదొడ్లు, దిబ్బలను ఆక్రమించుకుని  నిర్మాణాలు చేపడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ అంతా ఓ బోగస్‌ అని అన్నారు. వేలల్లో ఉద్యోగాలు ఇచ్చి లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన పట్ల ప్రజలు విసుగెత్తి పోయారని, రానున్న ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ప్రమోద్‌కుమార్‌రెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు ఎద్దులదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెండేకల్లు భాస్కర్‌రెడ్డి, చందోలి సర్పంచ్‌ రామిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-08T05:55:22+05:30 IST