ఆయాలకు అన్యాయం

ABN , First Publish Date - 2021-07-12T06:00:26+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల (ఆయాలు) కడుపు కొడుతోంది.

ఆయాలకు అన్యాయం

  1. గౌరవ వేతనాల్లో భారీ కోత 
  2. ఉత్తర్వులకు వ్యతిరేకంగా రూ.1000 


కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 11: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల (ఆయాలు) కడుపు కొడుతోంది. ప్రభుత్వం గతంలో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఉత్తర్వుల్లో చెప్పేదొకటి.. ఇప్పుడు చేస్తుంది మరొకటి అని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆయాలు విమర్శిస్తున్నారు. ఆయాలతో పని చేయించుకుని వేతనాలు చెల్లించడం లేదనే ఆరోపిస్తున్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టాయిలెట్స్‌ మెయింటెనెన్స్‌ నిర్వహణ ఫొటోలను అప్‌లోడ్‌ చేయలేదనే సాకుతో ఆయాల వేతనాల్లో కోతలు విధించడం సరి కాదని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల టాయిలెట్స్‌ నిర్వహణకు విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయాలను నియమించు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు విడుదల చేసింది. మెమో. నెంబర్‌.ఈఎస్‌ఈ02-27021/.05.02.2021 ప్రకారం గౌరవ వేతనం రూ.6 వేలు చెల్లిస్తామన్నారు.  పాఠశాలల్లో 300లోపు విద్యార్థుల సంఖ్య ఉంటే ఒక ఆయాను, 301 నుంచి 600లోపు విద్యార్థులు ఉంటే ఇద్దరిని, 601 నుంచి 900ల వరకు విద్యార్థులుంటే ముగ్గురు ఆయాలను, అంతకంటే ఎక్కువ ఉంటే నలుగురిని నియమించుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, పాఠశాలల విద్యాకమిటీకి ఆయాల నియామకాల బాధ్యతను అప్పగించారు. వారు తగినంత మంది ఆయాలను నియమించుకున్నారు. వీరికి వేతనాలను మరుగుదొడ్ల నిర్వహణ నిధుల (టీఎంఎఫ్‌) నుంచి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడి లబ్ధ్దిదారులు ఒక్కొక్కరి నుంచి రూ.1000 చొప్పున ప్రభుత్వం టీఎంఎఫ్‌ కోసం మినహాయించింది. 2021 జనవరి 9న అమ్మఒడి పథకం అందుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల నుంచి నగదు మినహాయిస్తోంది. దీన్నుంచి ఆయాలకు రూ.6 వేల చొప్పున పది నెలలు, రూ.3వేల చొప్పున రెండు నెలల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


జిల్లాలో 3,219 మంది ఆయాల నియామకం


జిల్లాలో 2898 ప్రభుత్వ పాఠశాలల్లో 3,219 మంది ఆయాలను నియమించారు. అప్పటి నుంచి వారికి ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించలేదు. 3219 మంది ఆయాలకు నెలకు ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున నెలకు రూ.19,31,400 అవుతుంది. ఈ లెక్కన 7 నెలలకు గాను దాదాపు రూ.13.51 కోట్లు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయాల బాధలు చూసి కొన్ని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులే తమ సొంత నిధుల నుంచి జీతాలు చెల్లించారు. ఆయాల వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరాయి. కరోనా ఉధృతితో మూతపడిన పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూన్‌ 1 నుంచి పునఃప్రారం భమయ్యాయి. ఆయాల వేతనాలపై స్పందించని విద్యాశాఖ ఏకంగా వారి గౌరవ వేతనంలో భారీ కోత పెట్టింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరుగుదొడ్లు నిర్వహణ ప్రమణాలు పొందుపరచడం లేదనే సాకు చూపి రెండు రోజుల క్రితం మెమో ఈఎస్‌ఈ 02-27021/ఎండీఎం/ఈఎస్‌ఈ/5.7.2021న మిడ్‌ డే మిల్‌ అండ్‌ స్కూల్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఆయాలకు నెలకు రూ.1000 చొప్పున చెల్లించాలని సూచించింది. చేసిన పనికి జీతాలు ఇవ్వకపోగా.. గౌరవ వేతనంలో కోత విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ చేసిన ఉత్తర్వులను ఉపసంహరిం చుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 


ఇది అన్యాయం


కరోనా కాలంలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు ఎనలేనివి. వారిని ముఖ్యమంత్రి జగన్‌ దేవుళ్లతో పోల్చారు. వారికి జీతాలు ఇవ్వాల్సి వచ్చేసరికి గౌరవ వేతనంలో భారీ కోత విధించి కడుపులు కొట్టడం సరైంది కాదు. మరుగుదొడ్ల నిర్వహణ, ఐఎంఎస్‌ యాప్‌లో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా రెండు మూడు స్థానాల్లో ఉందని విద్యాశాఖ అధికారులు గొప్పలు చెప్పుకున్నారు. ఐఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ జిల్లాకు ర్యాంకులు కూడా కేటాయించారు. ఇప్పుడేమో.. ఐఎంఎస్‌ యాప్‌లో మరుగుదొడ్ల నిర్వహణ ఫొటోలను అప్‌లోడ్‌ చేయలేదనడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం మొదట్లో చెప్పిన విధంగా ఆయాలకు గౌరవ వేతనం చెల్లించాలి. 

-  ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్‌


ఇది తాత్కాలికమే


పాఠశాలలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఇచ్చే రూ.1000 తాత్కాలికమే. అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మినహాయించుకున్న రూ.1000 ఎస్‌ఎం ఎఫ్‌లో జమ అయ్యాయి. దీని నుంచి డిస్ర్టిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌)కు ప్రభుత్వం నిధులను జమ చేయాల్సి ఉంది. పీడీ అకౌంటుకు ఫండింగ్‌ వచ్చిన వెంటనే ఆయాలకు మిగిలిన వేతనాలు చెల్లిస్తారు. ఆయాలు ఆందోలన చెందాల్సిన అవసరం లేదు. 

- సాయిరాం, డీఈవో

Updated Date - 2021-07-12T06:00:26+05:30 IST