వైరస్‌తో మిరపకు దెబ్బ

ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST

మిరప పైరుకు వైరస్‌ దెబ్బ తగిలింది.

వైరస్‌తో మిరపకు దెబ్బ
మల్లేవేములలో దెబ్బతిన్న మిరప పంట

  1. భారీగా తగ్గిన దిగుబడులు
  2. ఆందోళనలో రైతులు 


చాగలమర్రి, డిసెంబరు 19: మిరప పైరుకు వైరస్‌ దెబ్బ తగిలింది. ఇటీవల కురిసిన వర్షాలు, తెగుళ్ల వల్ల పంటలు దెబ్బతిని భారీగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని మల్లేవేముల, గొట్లూరు, శెట్టివీడు, గొడిగనూరు, ముత్యాలపాడు, చక్రవర్తులపల్లె, చింతలచెరువు, కొలుములపేట తదితర గ్రామాల్లో 100 ఎకరాల దాకా మిరప పంటను సాగు చేశారు. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఎకరాకు 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు నిరాశ చెందుతున్నారు.


పెరిగిన పెట్టుబడులు.. 

మిరప పైరుకు  వేరుకుళ్లు, పండాకు తెగుళ్లతోపాటు అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. తెగుళ్ల నివారణకు రైతులు ఎకరాకు రూ. లక్షలు ఖర్చు పెట్టి క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు. వీటి పెట్టుబడులు కూడా పెరిగిపోయాయి. దీనికి తోడు కూలీ రేట్లు కూడా పెరిగాయి. 


నిలకడ లేని ధరలు.. 

మిరపకు మార్కెట్‌లో మొదట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. క్వింటా రూ.20 వేలు నుంచి రూ.21 వేలు పలికింది. నెల రోజుల వ్యవధిలోనే రూ.18 వేల నుంచి రూ.10 వేల వరకు పడిపోయింది. కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలకు మిరప ఎగుమతి నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు అమాంతంగా తగ్గించారు. జిల్లాలో మిరప మార్కెటింగ్‌ లేకపోవడంతో గుం టూరుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో రవాణా ఖర్చులు కూడా పెరిగాయి.


భారీగా తగ్గిన దిగుబడి

రెండెకరాల్లో మిరప పంట సాగు చేశా. పెట్టుబడి రూ.1.50 లక్షలు ఖర్చు చేశా. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

- నరసింహా, రైతు, మల్లేవేముల 


అధిక వర్షాలతో నష్టపోయాం

మిరప పంట రెండెకరాల్లో సాగు చేశా. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టా. అకాల వర్షాలతో పూత, పిందే దెబ్బతింది. పంట దిగుబడి తగ్గింది. ధరలు కూడా పడిపోయాయి. 

- రాఘవరెడ్డి, రైతు, మల్లేవేముల 
Updated Date - 2021-12-19T05:30:00+05:30 IST