పల్లెకెళ్లేదెలా?

ABN , First Publish Date - 2021-11-26T05:07:55+05:30 IST

తుపాను ప్రభావంతో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు రహదారులు నడిచేందుకే వీలు లేకుండాపోయాయి.

పల్లెకెళ్లేదెలా?
చింతలచెరువు రహదారి దుస్థితి

  1. వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లు 
  2. రాకపోకలకు ఇబ్బందులు 
  3. పట్టని అధికారులు 

చాగలమర్రి, నవంబరు 25: తుపాను ప్రభావంతో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు రహదారులు నడిచేందుకే వీలు లేకుండాపోయాయి. రోడ్లన్నీ గుంతలు పడి బురదమయంగా మారాయి. చాగలమర్రి నుంచి మల్లెవేములకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి నీటి కుంటలను తలపిస్తోంది. గొడిగనూరు నుంచి కొత్తపల్లె, కొత్తపల్లె నుంచి డి.వనిపెంట వరకు రోడ్డు పొడవునా గుంతలే. వర్షపు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కలుగొట్లపల్లె నుంచి గొట్లూరుకు వెళ్లే రహదారి వర్షానికి గ్రావెల్‌ రోడ్డు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాంపల్లె నుంచి నేలంపాడు, గొట్లూరుకు వెళ్లే తారు రోడ్డు వర్షాలకు కోతకు గురై కంకర రాళ్లు బయటపడ్డాయి. రాత్రి వేలలో వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదానికి గురి కావాల్సిందే. చాగలమర్రి గ్రామంలోని తహసీల్దార్‌ కార్యాలయం రహదారి, కూరపాటి వీధి అధ్వానంగా ఉన్నాయి. వివిధ పనుల కోసం బజారుకు వెళ్లాలంటేనే ఆ ప్రాంతాల్లోని ప్రజలు రోడ్ల దుస్థితిని చూసి జంకుతున్నారు. ఇంకా పలు గ్రామాలు వెళ్లే రహదారుల పరిస్థితి కూడా ఇంతే. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధిని పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

రుద్రవరం, నవంబరు 25: మండలంలోని నరసాపురం నాలుగు రోడ్ల కూడలిలో రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా వదిలేశారు. గుంతల రహదారులతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.



Updated Date - 2021-11-26T05:07:55+05:30 IST