చాలమర్రిలో కుండపోత వర్షం
ABN , First Publish Date - 2021-10-30T05:01:28+05:30 IST
మండలంలోని గ్రామాల్లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది.

చాగలమర్రి, అక్టోబరు 29: మండలంలోని గ్రామాల్లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. 10 మీ.మీ వర్షపాతం నమోదైంది. 20 రోజుల నుంచి వర్షాలు కురవక రైతులు సాగు చేసిన మినుము, పత్తి, జొన్న, తదితర పంటలు వాడుముఖం పట్టాయి. తుఫాన్ ప్రభావంతో వర్షం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురవడంతో పంటలు జీవం పోసుకున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గొట్లూరు తదితర గ్రామాల్లోని పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. అలాగే ముత్యాలపాడు గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద వర్షపు నీరు నిలిచింది.
రుద్రవరం: మండలంలో శుక్రవారం వర్షం కురిసింది. మినుము, కంది, పెసర, పత్తి పంటలకు ఈ వర్షం ప్రాణం పోసినట్లైంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రుద్రవరం, ఎల్లావత్తుల, కోటకొండ గ్రామాల సమీపంలో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్నలు వర్షానికి తడిచిపోయాయి.