వీడని వర్షం.. తీరని నష్టం

ABN , First Publish Date - 2021-11-22T05:02:10+05:30 IST

వాయు గుండం ముప్పు తప్పినా వర్షం మాత్రం వీడటం లేదు. శనివారం తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది.

వీడని వర్షం.. తీరని నష్టం
గొట్లూరులో మినుము పంటలో నిలిచిన వర్షపు నీరు

  1. కుళ్లిపోతున్న పంటలు
  2. కుమిలిపోతున్న రైతులు
  3. పరిహారం కోసం వేడుకోలు

చాగలమర్రి, నవంబరు 21: వాయు గుండం ముప్పు తప్పినా వర్షం మాత్రం వీడటం లేదు. శనివారం తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది. 10.5 మీ.మీ వర్షపాతం నమోదైంది. మల్లెవేముల, గొట్లూరు, రాజోలి, నేలంపాడు, రాంపల్లె, పెద్దబోదనం, చిన్నబోదనం, మద్దూరు తదితర గ్రామాల్లో శనగ, మినుము, మొక్కజొన్న పంటలు వర్షపు నీటికి కుళ్లిపో తున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముత్యాలపాడు, ఎంతండా, ఓజీ తండా, చక్రవర్తులపల్లె, చింతలచెరువు, చిన్నవంగలి, పెద్దవంగలి తదితర గ్రామాల్లో 600 ఎకరాలకు పైగా వరి పంట నేలవాలి దెబ్బతింది. చేతికొచ్చిన పంట నేలవాలడంతో రంగుమారి దెబ్బతింది. వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రారని రైతులు వాపోతున్నారు. ఉల్లి, మిరప, ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు పరిహారం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


800 ఎకరాల్లో దెబ్బతిన్న కేపీ ఉల్లి 

తుపాన్‌ ధాటికి కేపీ ఉల్లి పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు అనిల్‌ కుమార్‌రెడ్డి, నరసింహా రెడ్డి, చెన్నారెడ్డి, బయన్న యాదవ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం దెబ్బ తిన్న కేపీ ఉల్లి పంటను చూపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షా లతో కేపీ ఉల్లి కుళ్లి పోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టామని ఒక్క రూపాయి కూడా చేతికందే పరిస్థితి లేదని వాపోయారు. చిన్నవంగలి, చింతలచెరువు, కొలుములపేట, మూడు రాళ్లపల్లె, కొత్తపల్లె, ఆవులపల్లె తదితర గ్రామాల్లో రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో కేపీ ఉల్లి పంట సాగు చేశారు. 800 ఎకరాల ఉల్లి పంట కుళ్లిపోయి రూ.లక్షల నష్టం వాటిళ్లిందని రైతులు విలపించారు. దెబ్బతిన్న కేపీ ఉల్లిని తొలగించి ప్రత్యామ్నాయ పంట సాగు చేసుకోవాల్సి వస్తోందని రైతులు వాపోయారు. సంబంధిత అధికారులు ఉల్లి పంటను పరిశీలించి పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు.

రుద్రవరం, నవంబరు 21: గత పది రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి గ్రామంలో వరి పంట గాలి, వానతో నేలకూలింది. బి.నాగిరెడ్డిపల్లెలో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. రుద్రవరం, రెడ్డిపల్లె, నాగులవరం గ్రామ సమీపాల్లో రైతులు సాగు చేసిన పసుపు, పత్తి, మిరప, మొక్కజొన్న పంటల్లో వర్షపు నీరు నిల్వ చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 





Updated Date - 2021-11-22T05:02:10+05:30 IST