శిలాఫలకంపై నర్సరీ

ABN , First Publish Date - 2021-05-21T05:34:21+05:30 IST

నల్లమల సమీపంలో పండ్ల తోటల పెంపకానికి అనువైన భూములు ఉన్నాయి. దీన్ని గుర్తించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు హరినగరం సమీపంలో నర్సరీ ఏర్పాటు చేసి, పండ్ల మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని భావించారు.

శిలాఫలకంపై నర్సరీ
పిచ్చి మొక్కల మధ్య అప్పటి కలెక్టర్‌, ఎమ్మెల్యే ప్రారంభించిన శిలాఫలకం

  1. పదిహేనేళ్ల క్రితం భూముల కేటాయింపు
  2. పనులకు రూ.18 లక్షల నిధులు కూడా..
  3. అంతటితో వదిలేసిన ఉద్యానవన శాఖ


రుద్రవరం, మే 20: నల్లమల సమీపంలో పండ్ల తోటల పెంపకానికి అనువైన భూములు ఉన్నాయి. దీన్ని గుర్తించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు హరినగరం సమీపంలో నర్సరీ ఏర్పాటు చేసి, పండ్ల మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని భావించారు. 2006 నవంబరు 10వ తేదీన అప్పటి కలెక్టర్‌ దానకిశోర్‌, ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నర్సరీ పనుల కోసం రూ.18 లక్షల నిధులు కేటాయించారు. వివిధ సర్వే నెంబర్లలో మొత్తం 10.20 ఎకరాల భూమిని కూడా ఉద్యానవన శాఖకు అప్పగించారు. కానీ ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 


అనువైన భూములు

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల, ఆళ్లగడ్డ మండలాల్లో పండ్ల తోటల పెంపకానికి అనువైన భూములు ఉన్నాయి. ఇక్కడి రైతులకు పండ్ల మొక్కలు అందించాలన్న లక్ష్యంతో నల్లమల సమీపంలోని హరినగరం వద్ద ఉద్యానవన నర్సరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నర్సరీకి 804/4 సర్వే నెంబరులో 3.50 ఎకరాలు, 804/5లో 3 ఎకరాలు, 804/6లో 3 ఎకరాలు, 890/4లో 0.31 ఎకరాలు, 891/1 సిలో 0.32 ఎకరాలు కేటాయించారు. మొత్తం 10.20 ఎకరాలను రెవెన్యూ శాఖ ఉద్యావనశాఖకు అప్పగించింది. ఈ భూములు చదును చేయడానికి అప్పట్లో ప్రభుత్వం రూ.లక్ష కేటాయించింది. కానీ పనులు చేపట్టలేదు. అటవీ సమీప ప్రాంతం రైతులు పండ్ల తోటలు సాగుచేయాలని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. పండ్లతోటలను సాగుచేయాలని, సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది. కానీ ఇక్కడి అధికారులు నర్సరీ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. పండ్ల మొక్కలు కనుచూపుమేరలో కనిపించటం లేదు. 


నర్సరీని ఏర్పాటు చేయండి


పండ్ల మొక్కల నర్సరీని ఉద్యాన శాఖ అధికారులు ఏర్పాటు చేయాలి. 2006లో నర్సరీకి ప్రభుత్వ భూములు కేటాయించారు. అధికారులు పట్టించుకోవడం లేదు. పండ్ల మొక్కలు స్థానికంగా అందుతాయని అనుకున్న రైతులకు నిరాశ మిగిలింది.

- ప్రసాదరెడ్డి, మాజీ సర్పంచ్‌, నరసాపురం


వెంటనే స్పందించాలి..


రైతులకు అందుబాటులో పండ్ల మొక్కలు ఉంటే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతారు. నర్సరీ కోసం భూములు కేటాయించారు. ఏళ్లు గడుస్తున్నా నర్సరీ ఏర్పాటు కాలేదు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నర్సరీని ఏర్పాటు చేయించాలి.                   

 - వెంకటసుబ్బనర్సయ్య, రైతు, నాగులవరం

Updated Date - 2021-05-21T05:34:21+05:30 IST