నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

ABN , First Publish Date - 2021-02-06T05:27:57+05:30 IST

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు శనివారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

  1. 245 పంచాయతీలు, 2,516 వార్డు స్థానాలకు ఎన్నికలు
  2. 14 మండలాల్లో 5,14,610 మంది ఓటర్లు 


కర్నూలు(కలెక్టరేట్‌) ఫిబ్రవరి 5: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు శనివారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలోని 14 మండలాల్లో 245 పంచాయతీలు, 2,516 వార్డు స్థానాలకు ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే వాటిలో కర్నూలు డివిజన్‌లోని జూపాడుబంగ్లా మండలంలో 12, కొత్తపల్లిలో 12, మిడ్తూరులో 19, నందికొట్కూరులో 12, పగిడ్యాలలో 8, పాముపాడులో 14, బేతంచర్లలో 19, డోన్‌లో 31, ప్యాపిలిలో 31, క్రిష్ణగిరిలో 16, వెల్దుర్తిలో 23 గ్రామపంచాయతీల్లో, ఆదోని డివిజన్‌లోని మద్దికెర మండలంలో 8, పత్తికొండలో 17, తుగ్గలిలో 23 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ పత్రాలను ఆయా క్లస్టర్‌ పంచాయతీల్లో అధికారులు స్వీకరిస్తారు. ఈ పంచాయతీల్లో 2,58,075 మంది పురుష ఓటర్లు, 2,56,497 మంది మహిళా ఓటర్లు, 38 మంది ఇతరులు.. మొత్తం 5,14,610 మంది ఓటర్లు ఉన్నారు. 



నామినేషన్ల ప్రక్రియ ఇలా..

ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు: నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 9: నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 10: తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాల స్వీకరణ

ఫిబ్రవరి 11: అభ్యంతరాలపై తుది నిర్ణయం

ఫిబ్రవరి 12న: నామినేషన్ల ఉప సంహరణ, బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదల

ఫిబ్రవరి 17న: పోలింగ్‌

ఫిబ్రవరి 17న: మధ్యాహ్నం 4 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల


తిరస్కరణలు 195

జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సరైన ఆధారాలు లేని 195 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 13 మండలాల్లో సర్పంచు నామినేషన్లు 80, వార్డు సభ్యుల నామినేషన్లు 115 తిరస్కరించారు. కోవెలకుంట్ల మండలంలో అత్యధికంగా 10 నామినేషన్లు, అవుకు మండలంలో 21 వార్డు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 


141 పంచాయతీలకు ఎన్నికలు

గ్రామపంచాయతీ మొదటి దశ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 12 మండలాల్లో 193 గ్రామ పంచాయతీలు, 1,922 వార్డు సభ్యుల స్థానాల అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఇందులో 52 గ్రామపంచాయతీలు, 722 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 141 గ్రామ పంచాయతీల్లో ఈనెల 9న ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచు స్థానాలకు 389 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 2,645 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు.

Updated Date - 2021-02-06T05:27:57+05:30 IST