హోరెత్తిన సీపీఎస్‌ పోరు

ABN , First Publish Date - 2021-09-02T06:04:26+05:30 IST

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌యూఎస్‌, ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

హోరెత్తిన సీపీఎస్‌ పోరు
కర్నూలు నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఏపీ సీపీఎస్‌ఈఏ నాయకులు

  1.  సీఎం జగన మాట నిలబెట్టుకోవాలి
  2.  లేదంటే మూల్యం చెల్లించక తప్పదు
  3.  ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక
  4.  పాత పెన్షన విధానం అమలు చేయాలని ఆందోళన
  5.  ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌ఈఏ బహిరంగ సభలు 


కర్నూలు(ఎడ్యుకేషన), సెప్టెంబరు 1: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌యూఎస్‌, ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కర్నూలు నగరంలో వేర్వేరుగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాయి. ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌యూఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా పరిషత కార్యాలయం నుంచి ఎస్టీబీసీ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ కంట్రిబ్యూటరీ పెన్షన స్కీం ఎంప్లాయీస్‌ అసోసియేషన ఆధ్వర్యంలో వినాయక ఘాట్‌ నుంచి శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 


రద్దు చేయాల్సిందే..

ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏపీజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు, ఆప్టా ప్రధాన కార్యదర్శి ప్రకాశరావు ప్రసంగించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 24 డిమాండ్లు చేస్తే.. అందులో ప్రధానమైన సీపీఎస్‌ రద్దు అంశం ఉంటుందని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు దాటినా, సీపీఎస్‌ను రద్దు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. 2004 సెప్టెంబరు 1న సీపీఎస్‌ విధానం అమలులోకి వచ్చిందని, ఆ రోజును బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ విధానం వల్ల పదవీ విరమణ పొందిన తర్వాత వర్తించే పెన్షన, గ్రాట్యుటి, కమ్యునిటేషన వంటి ప్రయోజనాలు దూరమౌతాయని అన్నారు. సామాజిక, ఆర్థిక భద్రత హక్కులు, పోరాడి సాధించుకున్న సదుపాయాలను తుంగలోతొక్కి సీపీఎస్‌ విధానాన్ని తెచ్చారని మండిపడ్డారు. ఉద్యోగ విరమణ అనంతర భవిష్యత్తును షేర్‌ మార్కెట్‌లో కార్పొరేట్‌ సంస్థలకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. సీపీఎస్‌ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ మీన మేషాలు లెక్కిస్తూ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా కన్వీనర్‌ సుధాకర్‌, కో కన్వీనర్‌ రంగన్న, బీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఓంకార్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణ, ఏపీటీఎఫ్‌ నాయకుడు కె.శివయ్య, యూటీఎఫ్‌ నాయకుడు సురేష్‌ కుమార్‌, ఏపీజేఏసీ జిల్లా నాయకుడు కృష్ణుడు, ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షుడు హెచ.తిమ్మన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గోకారి, డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప, బీటీఏ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌, పీఈటీ ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, యూటీఎఫ్‌ నాయకులు ఎల్లప్ప, సురేష్‌ కుమార్‌, విక్రమ్‌సింగ్‌, ఎస్టీయూ నాయకులు ప్రసాద్‌ రెడ్డి, ఏపీటీఎస్‌ నాయకులు మాధవస్వామి, ఇస్మాయిల్‌ ఆర్‌యూపీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

 హామీని నిలబెట్టుకోవాలి : ఏపీసీపీఎస్‌ఈఏ

 సీపీఎస్‌ రద్దుపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన స్కీం ఎంప్లాయీస్‌ అసోసియేషన రాష్ట్ర సహాధ్యక్షుడు రామనరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌ విధానం రద్దు చేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎస్‌ రద్దుపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేస్తే తక్షణమే లబ్ధి పొందేది రాష్ట్ర ప్రభుత్వమే అని అన్నారు. ఎనఎస్‌బీఎల్‌లో ఉన్న రూ.10 వేల కోట్లు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అవుతాయని అన్నారు. సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.కరుణానిధిమూర్తి, జిల్లా అధ్యక్షుడు ఎన.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర కార్యదర్శి రాంభూపాల్‌ రెడ్డి, జవహర్‌ ఇషాక్‌, రామనాయుడు, రామాంజినేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి, ఆర్థిక కార్యదర్శి హబీబుల్లా, ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ రెడ్డి, నగర అధ్యక్ష, కార్యదర్శులు బంగి శ్రీధర్‌, శ్రీహరి, కార్యవర్గ సభ్యులు రూపేష్‌ కుమార్‌, సత్యనారాయణ, ఏపీఎంఈఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎనటీఏ గౌరవాధ్యక్షుడు బాలన్న, ఏపీయూఎస్‌ జిల్లా అధ్యక్షుడు నాగస్వామి నాయక్‌, హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్వి చంద్రశేఖర్‌, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బాలమద్దయ్య తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-09-02T06:04:26+05:30 IST