నకిలీ విత్తు!

ABN , First Publish Date - 2021-10-05T06:12:23+05:30 IST

నకిలీ మొక్కజొన్న విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి.

నకిలీ విత్తు!
ఎగుడు దిగుడుగా పెరిగిన మొక్కజొన్న పంట

  1. పెరగని మొక్కజొన్న పంట
  2. తీవ్రంగా నష్టపోయిన రైతులు
  3. న్యాయం చేయాలని ప్రభుత్వానికి వినతి


గడివేముల, అక్టోబరు 4: నకిలీ మొక్కజొన్న విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి. చిందుకూరు గ్రామ రైతులు ఓ ప్రైవేటు కంపెనీ మొక్కజొన్న విత్తనాలు కొనుగోలుచేసి తీవ్రంగా నష్టపోయారు. అదే కంపెనీకి చెందిన విత్తనాలను గత ఏడాది కొందరు రైతులు సాగు చేశారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో ఈ ఏడాది మరికొందరు రైతులు ఆ కంపెనీ విత్తనాలను కొని, సుమారు 160 ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడి కోసం ఎకరానికి రూ.30 వేల వరకు ఖర్చు చేశారు. విత్తనం వేసి మూడున్నర నెలలు గడిచినా పైరులో ఎదుగుదల కనిపించలేదు. కంకి పెరగడం లేదు. గింజలు కూడా రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సమస్యను విత్తన కంపెనీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీ ప్రతినిధులు పంట పరిశీలనకు సిబ్బందిని పంపించి చేతులు దులుపుకున్నారని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు చేసేది లేక పంటను దున్నేశారు. సమస్యను మండల వ్యవసాయాధికారులకు, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


గింజలు రావడం లేదు..


9 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాను. ఇప్పటి వరకూ ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేశాను. కంకి చిన్నగా వచ్చింది. గింజలు రాలేదు. దీంతో ఆరు ఎకరాల్లో పంటను దున్నేశాను. అధికారులు మమ్మల్ని ఆదుకోవాలి.


- రాఘవేంద్రారెడ్డి, రైతు, చిందుకూరు


మోసపోయాం..


గత ఏడాది దిగుబడి బాగా వచ్చింది. దీంతో ఈ సారి కూడా అదే కంపెనీ విత్తనాలను కొనుగోలుచేసి 11 ఎకరాల్లో సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశాను. కంకి రావడం లేదు. కంపెనీ వారికి చెబితే పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.


- మద్దిలేటి, రైతు, చిందుకూరు


ప్రభుత్వం స్పందించాలి..


మొక్కజొన్న పంటను 4 ఎకరాల్లో సాగు చేశాను. పైరు పెరగడం లేదు. గింజలు రావడం లేదు. ఇలాగైతే ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి కూడా రాదు. నకిలీ విత్తనాలతో మోసగించారు. ప్రభుత్వం స్పందించి మాకు పరిహారం ఇప్పించాలి. 


- పెద్దరాజు, రైతు, చిందుకూరు 


ఉన్నతాధికారులకు నివేదిక..


చిందుకూరు రైతులు సమస్యను మా దృష్టికి తెచ్చారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి మొక్కజొన్న పంట పరిశీలించాను. పైరు స్థితిగతులను శాస్త్రవేత్తలకు వివరించాము. రైతుల నుంచి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదికను పంపించాము.                    


 - హేమసుందర్‌ రెడ్డి, మండల వ్యవసాయాధికారి

Updated Date - 2021-10-05T06:12:23+05:30 IST