కొండలపై కన్ను
ABN , First Publish Date - 2021-12-15T05:55:20+05:30 IST
కొండకు గాలం వేస్తున్నారు. పోయేది ఏమీ లేదు. మహా అయితే అధికారులకు లంచం. దర్జాగా తవ్వకాలు జరపొచ్చు.

- పత్తికొండలో చదును చేసి ఆక్రమణ
- ప్యాపిలి వద్ద ఎర్రమట్టి కోసం తవ్వకాలు
- చెలరేగుతున్న రియల్టర్లు, మట్టి మాఫియా
- కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు
కొండకు గాలం వేస్తున్నారు. పోయేది ఏమీ లేదు. మహా అయితే అధికారులకు లంచం. దర్జాగా తవ్వకాలు జరపొచ్చు. ఆక్రమించి అమ్మేయవచ్చు. జిల్లాలోని ప్యాపిలి, పత్తికొండ ప్రాంతాల్లో ఇదే జరుగుతోంది. రియల్ వెంచర్లకు అవసరమైన ఎర్రమట్టి కోసం ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. యంత్రాలతో కొండలను నిలువునా తవ్వేస్తున్నారు. మరికొందరు కొండలను పొలాలుగా చూపించి చదును చేసి ఆక్రమిస్తున్నారు. స్థలాల ధరలకు రెక్కలు రావడంతో ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు.
ప్యాపిలి, డిసెంబరు 14: పట్టణంలో ఎర్రమట్టి మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పట్టణంలో రెండు మూడు నెలలుగా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. స్థానిక రియల్టర్లతో పాటు అనంతపురం, కర్నూలు, గుత్తి తదితర ప్రాంతాల నుంచి రియల్ వ్యాపారులు ఇక్కడికి వచ్చి భూములను కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. లే అవుట్లు వేయడానికి అవసరమైన ఎర్రమట్టికి డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు ఎర్రమట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపారు.
కరుగుతున్న కొండలు
పట్టణం సమీపంలోని పలు ప్రాంతాల్లో కొండలు ఉన్నాయి. చాలామంది పశువులు, గొర్రెలను మేతకోసం ఈ కొండలపైకి తీసుకువెళుతుంటారు. ఎర్రమట్టి మాఫియా అక్రమ తవ్వకాల కారణంగా కొండలు కరిగిపోతున్నాయి. దీంతో పశువులకు, గొర్రెలకు మేత కరువు అవుతోంది. అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.
రాత్రి పూట రవాణా
ప్యాపిలి పట్టణ సమీపంలోని ఐదారు కొండ ప్రాంతాల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. పగటి పూట మట్టి రవాణా చేస్తే అధికారుల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో రాత్రిపూట రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని లే అవుట్లకు తరలిస్తున్నారు. రోజుకు వంద ట్రాక్టర్లకుపైగా ఎర్రమట్టిని తరలిస్తున్నారని తెలిసింది. ట్రాక్టర్ మట్టికి రూ.800, టిప్పర్‌కి రూ.3 వేలు తీసుకుంటున్నారు.
పార్వతి కొండ.. పొలమట..!
పత్తికొండ: పట్టణ నడిబొడ్డున ఉన్న పార్వతి కొండపై అక్రమార్కుల కన్ను పడింది. యంత్రాలతో కొండను తవ్వి మట్టిని అమ్ముతున్నారు. వ్యవసాయ పొలంగా చూపించి కబ్జాకు మార్గం సుగమం చేసుకున్నారు. అటు మట్టి అమ్మకం, ఇటు చదును చేసిన స్థలం కబ్జాతో భారీగా వెనకేసుకుంటున్నారు. పార్వతికొండను ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో చూపించారు. కొండ పైభాగంలో కొందరు స్థలాలు పట్టుకుని ఇళ్లను నిర్మించుకున్నారు. మిగిలిన కొండలో రాళ్లు ఎటువాలుగా ఉన్న ప్రాంతాన్ని మాత్రం వదిలి చదునుగా ఉన్న ప్రాంతంలో ఇంటి స్థలాలను ఇచ్చారు. రెండేళ్ల క్రితం నారాయణరెడ్డి కాలనీ పేరిట స్థానిక ఎమ్మెల్యే పట్టాలు మంజూరు చేయించారు. కొండ ప్రాంతంగా ఉన్న మరో రెండు ఎకరాలపై కొందరు కన్నేశారు. వ్యవసాయ పట్టా భూమిగా రికార్డును సృష్టించుకుని చదును చేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగి ఒకరు ఈ రికార్డులను సృష్టించారని, పట్టణంలో పెద్ద రియల్టర్‌గా పేరుగాంచిన వ్యక్తితో కలిసి చదును కార్యక్రమాలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ రియల్టర్‌కు అధికార పార్టీలో పరిచయాలు ఉండడంతో నిర్భయంగా పనులు చేయిస్తున్నారు. రెండు ఎక్స్‌కవేటర్లను వినియోగించి వారంరోజులుగా కొండ ప్రాంతాన్ని చదును చేయిస్తున్నారు. కొండను తవ్వగా వచ్చిన ఎర్ర మట్టిని తాను ఇదివరకే ఏర్పాటు చేసిన వెంచర్‌కు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు.
సిబ్బందిని పంపాము..
పార్వతి కొండ వద్దకు సిబ్బందిని పంపించాము. అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. అది ప్రభుత్వ భూమా, పట్టా భూమా అన్నది విచారిస్తాము. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాము.
- ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్