ఉపాధి పెండింగ్‌ బిల్లులను చెల్లించాలి

ABN , First Publish Date - 2021-08-03T05:37:15+05:30 IST

రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించక పోవడం దారుణమని, దీంతో పనులు చేసిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు అన్నారు.

ఉపాధి పెండింగ్‌ బిల్లులను చెల్లించాలి
విలేకరులతో మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

  1. లేకుంటే ఆందోళనలు ఉధృతం 
  2. టీడీపీ నాయకుల ఆల్టిమేటం


కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 2: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించక పోవడం దారుణమని, దీంతో పనులు చేసిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు అన్నారు. ప్రభుత్వం వెంటనే బిల్లులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఎంపీడీవోలకు వినతిపత్రాలను అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వై.నాగేశ్వరరావు యాదవ్‌ తదితరులు డీఆర్వో పుల్లయ్యకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ఉపాధి హామీ నిధులను వినియోగించిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజకీయ కక్షతో ఉపాధి నిధులను చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. పనులు చేపట్టిన మాజీ సర్పంచులను, కాంట్రాక్టర్లను, ఇతర నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, లేకుంటే టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. టీడీపీ హయాంలో సొంత నిధులు ఖర్చు చేసి ప్రజాప్రతినిధులు, చిన్న కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. టీడీపీ వారే కాకుండా గ్రామాల అభివృద్ధి కోసం పనులు చేసిన వారి మీద కూడా సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. నంద్యాల మండలం గాజులపల్లిలో ఉపాధి హామీ పనులు చేసిన కొండారెడ్డి అనే వ్యక్తి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఉపాధి నిధులను ఆగస్టు 1లోగా చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని, అందుకే టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం అధికారులకు వినతిపత్రాలు అందజేశామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకేపోగు ప్రభాకర్‌, నాగేంద్రకుమార్‌, సత్రం రామక్రిష్ణుడు, హనుమంతరావు చౌదరి, కొరకంచి రవికుమార్‌, గున్నా మార్క్‌, రాజు, శాంతరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:37:15+05:30 IST