ఈడీ సోదాలు
ABN , First Publish Date - 2021-03-24T06:20:09+05:30 IST
జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు కలకలం రేపాయి. నంద్యాల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో పలువురి ఇళ్లలో ఈడీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
- నంద్యాల, ఎమ్మిగనూరులో కలకలం
- ఏకకాలంలో కొన్ని ఇళ్లకు వెళ్లిన అధికారులు
- ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్స్‌పై ప్రశ్నలు
నంద్యాల (నూనెపల్లె)/ఎమ్మిగనూరు, మార్చి 23: జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు కలకలం రేపాయి. నంద్యాల, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో పలువురి ఇళ్లలో ఈడీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సోదాలపై అత్యంత గోప్యత పాటించారు. ఈడీ అధికారులకు రక్షణగా కేంద్ర పోలీసు బలగాలు మోహరించడం చర్చనీయాంశంగా మారింది. వారికి స్థానిక పోలీసులు సహకరించారు. నంద్యాల పట్టణంలోని ఉప్పరిపేటలో అల్లాబకాష్, సరస్వతి నగర్‌లో అతావుల్లా ఖాన్, అయ్యలూరులో హుసేన్ పీరా, కానాలలో షేక్ మౌలాలి, నందమూరి నగర్‌లో మరో వ్యక్తి ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. ఈడీ అనుమానిత జాబితాలో ఉన్న వ్యక్తులు తనిఖీల సమయంలో ఇళ్లలో లేనట్లు సమాచారం. వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఎస్‌డీపీఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నవారి బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఇతర వ్యవహారాల గురించి ఈడీ అధికారులు ఆరాతీసినట్లు సమాచారం. అయితే ఎందుకు సోదాలు చేసిందీ ఈడీ అధికారులు వెల్లడించలేదు. సోదాలకు పూర్తి కారణాలు తెలియరాలేదు. ఒక్కో ఇంట్లో 6 గంటలకుపైగా ఈడీ అధికారుల బృందం సోదాలు చేసింది.
ఈడీ తీరుపై ఆగ్రహం
నంద్యాల పట్టణం, మండలంలోని కానాలతో పాటు సోదాలు జరిగిన ప్రాంతాలకు ఎస్‌డీఈఐ, పాపులర్ ఫ్రంట్ నాయకులు చేరుకున్నారు. సోదాల అనంతరం ఈడీ అధికారుల బృందం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతుండటంతో ఎస్‌డీపీఐ, పాపులర్ ఫ్రంట్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాలు ఎందుకు చేస్తున్నారో.. సోదాల అనంతరం ఏం తెలుసుకున్నారో వివరణ ఇవ్వకుండా ఎలా వెళ్లిపోతారని ప్రశ్నించారు. నాయకులు, కార్యకర్తలు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానాల గ్రామంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ అధికారుల వాహనాలను ఘెరావ్ చేశారు. స్థానిక పోలీసు అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు. దీంతో ఈడీ అధికారుల బృందం వెళ్లిపోయింది.
గల్ఫ్‌కు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంట్లో..
ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మహ్మద్ రసూల్ ఇంట్లో ఈడీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. కేంద్ర బలగాలతో కలిసి వచ్చిన అధికారులు, పూర్తిస్థాయి భద్రత నడుమ ఆ ఇంట్లోకి ప్రవేశించారు. మహ్మద్ రసూల్ పట్టణంలోని కూనిపంజా మైదానం సమీపంలో నివాసం ఉంటున్నాడు. బతుకుదెరువు కోసం కతార్ దేశానికి వెళ్లి వస్తుంటాడు. రెండునెలల క్రితం కూడా కతార్ వెళ్లి వచ్చాడు. చెన్నై నుంచి మంగళవారం వచ్చిన ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ కార్తికేయ ఆధ్వర్యంలో ఇద్దరు అధికారులు రసూల్ ఇంటికి ఉదయం 10 గంటలకు చేరుకుని సోదాలు ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఆర్థిక లావాదేవీలు, ఫోన్ సంభాషణల గురించి రసూల్ కుటుంబ సభ్యులను విచారించినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కాగితాలను పరిశీలించినట్లు సమాచారం. బ్యాంకు పాసుపుస్తకం, సెల్‌ఫోన్ సీజ్ చేశారని తెలిసింది. ఈడీ అధికారులు సోదాలు చేసినంత సేపు రసూల్ బంధువులు, కాలనీ ప్రజలు అందోళన చెందారు. సోదాలు నిర్వహించి బయటకు వచ్చిన అధికారులు విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈడీ సోదాలు ముగిసిన అనంతరం పట్టణ సీఐ శ్రీనివాస నాయక్, ఎస్‌ఐ ప్రసాద్ పోలీసులు రసూల్ ఇంటి వద్దకు వచ్చి పరిశీలించి వెళ్లారు.
సోదాలు ఎందుకు చేశారో తెలీదు..
(ఈడీ సోదాలపై సెల్ఫీ వీడియోలో రసూల్ స్పందన)
ఈడీ అధికారులు మా ఇంట్లో ఎందుకు సోదాలు చేశారో నాకు అర్థం కావటం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. 2014లో నాకు రూ.50 వేలు, రూ.80 వేలు ఏలా వచ్చాయి అని ఈడీ అధికారులు అడిగారు. అప్పట్లో నేను చిరువ్యాపారం చేసేవాడినని చెప్పాను. రూ.80 లక్షలు, ప్లాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐలో పనిచేశావా అని అడిగారు. ఇప్పటి వరకు నేను రూ.పది లక్షలు కూడా చూడలేదు. బ్యాంకు అకౌంట్‌బుక్, సెల్‌ఫోన్ సీజ్ చేశారు. నన్ను బదనామ్ చేసేందుకు ఇలా చేశారు.