ఈ-కాప్స్‌ ఎస్‌ఐ రాఘవరెడ్డి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-08T05:49:02+05:30 IST

జిల్లా పోలీస్‌ శాఖలో పని చేసే ఈ-కాప్స్‌ ఎస్‌ఐ రాఘవరెడ్డి (58) తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ-కాప్స్‌ ఎస్‌ఐ రాఘవరెడ్డి ఆత్మహత్య
రాఘవరెడ్డి (ఫైల్‌ఫొటో)


కర్నూలు, డిసెంబరు 7: జిల్లా పోలీస్‌ శాఖలో పని చేసే  ఈ-కాప్స్‌ ఎస్‌ఐ రాఘవరెడ్డి (58) తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం లేపింది. అనంతపురం జిల్లా కదిరి మండలానికి చెందిన రాఘవరెడ్డి 1991 బ్యాచకు చెందిన ఎస్‌ఐ. కర్నూలు జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐగా పని చేశారు. రైల్వేలో ఎస్‌ఐగా పని చేస్తున్నప్పుడు కొన్ని ఆరోపణలతో ఆయన పదోన్నతి ఆగిపోయింది. దీంతో ఆయన ఎస్‌ఐగానే విధుల్లో కొనసాగారు. సివిల్‌ స్టేషనకు వెళ్లకుండా ఈ-కాప్స్‌, సైబర్‌ ల్యాబ్‌లో విధులు నిర్వహించారు. వెంకటరమణ కాలనీలో అక్షయ అపార్టుమెంట్‌ ఐదో ఫ్లోర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య రాధిక, ఇద్దరు కొడుకులు రాకేష్‌ రెడ్డి, సాయి దినేష్‌ రెడ్డి ఉన్నారు. రాకేష్‌రెడ్డి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా.. సాయి దినేష్‌ రెడ్డి మహారాష్ట్రలో ఉద్యోగి. భార్య రాధిక పెద్ద కొడుకుతో కలిసి హైదరాబాదులో ఉంటు న్నారు. రాఘవరెడ్డి ఒక్కరే అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. మంగళవారం సైబర్‌ ల్యాబ్‌కు కూడా విధులకు వెళ్లలేదు. రాఘవరెడ్డి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పక్కనే ఉంటున్న అపార్టు మెంటు వాసులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చి హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఆయన భార్య, కొడుకులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రానికి భార్య, కొడుకు కర్నూలుకు చేరుకున్నారు. కుటుంబ కలహాలతోనే రాఘవరెడ్డి ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన పోలీసులు తెలిపారు. Updated Date - 2021-12-08T05:49:02+05:30 IST