గనులపై బాదుడు

ABN , First Publish Date - 2021-08-21T05:36:16+05:30 IST

గనుల నిర్వాహకులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.

గనులపై బాదుడు
గ్రానైట్‌ ఫ్యాక్టరీ

  1.  డెడ్‌ రెంట్లు ఐదు రెట్లు పెంపు
  2. కొత్త లీజులకైతే పదిరెట్లు కట్టాల్సిందే
  3. మైనర్‌ మినరల్స్‌కు ప్రభుత్వం షాక్‌
  4. ప్రమాదంలో చిన్నతరహా పరిశ్రమలు 


డోన, ఆగస్టు 19: గనుల నిర్వాహకులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. చిన్న తరహా పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకమయ్యే స్థాయిలో డెడ్‌ రెంట్లను ప్రభుత్వం ఐదు రెట్లు పెంచింది. ఇప్పటిదాకా గ్రానైట్‌ క్వారీ లీజు ఉంటే హెక్టారుకు ఏడాదికి రూ.1.30 లక్షలు డెడ్‌ రెంట్‌ కట్టేవారు. ఈ మొత్తానికి గనుల శాఖ రాయల్టీలు జారీ చేసేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. లీజు గనులకు చెల్లించే డెడ్‌ రెంటును ఐదురెట్లకు పెంచడంతోపాటు, ఆ మొత్తానికి ఎలాంటి రాయల్టీలు ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్క గ్రానైట్‌ మీదనే కాదు.. మొత్తం 31 రకాల మైనర్‌ మినరల్స్‌పై డెడ్‌ రెంట్లను భారీగా పెంచేసింది. దీంతో గనులు, క్వారీల యజమానులు లబోదిబోమంటున్నారు. 


పిడుగుపాటు

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 28న జీవో 65ను జారీ చేసింది. మొత్తం 31 మైనర్‌ మినరల్స్‌పై డెడ్‌ రెంట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. డెడ్‌ రెంట్లను ఐదు రెట్లకు పెంచి కట్టాలని గనుల యజమానులకు సూచించింది. ఇకపై కట్టే డెడ్‌ రెంట్లకు ఎలాంటి రాయల్టీలు ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చేసింది. జిల్లాలో డోన, బేతంచెర్ల, క్రిష్ణగిరి, ప్యాపిలి, బనగానపల్లె, ఆదోని, ఆలూరు, తుగ్గలి తదితర ప్రాంతాల్లో గనులు ఎక్కువగా ఉన్నాయి. గ్రానైట్‌, డోలమైట్‌, స్లాబ్స్‌, వైట్‌ క్లే, వైట్‌ సేల్‌, స్టీట్‌ హైట్‌, క్వార్జ్‌ రోడ్‌మెటల్‌ తదితర ఖనిజాలు ఈ ప్రాంతాల్లో లభిస్తున్నాయి. గనుల నుంచి బయటకు తీసిన వివిధ రకాల ముడి ఖనిజాలను చిన్నతరహా పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీటి మనుగడ ప్రశ్నార్థకం కానుందని బాధితులు అంటున్నారు. గనుల యజమానులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.


ప్రమాదంలో మైనర్‌ మినరల్స్‌

గనులు, క్వారీలపై డెడ్‌ రెంట్ల బాదుడుతో మైనర్‌ మినరల్స్‌ (చిన్న తరహా పరిశ్రమలు) ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఆరు వేల వరకు మైనర్‌ మినరల్స్‌ ఉంటాయని అంచనా. వీటన్నింటికీ వివిధ రకాల ముడి ఖనిజాలు గనులు, క్వారీల నుంచి రవాణా అవుతున్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులతో మైనర్‌ మినరల్స్‌ మూతబడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ పరిమాణాలు మైనర్‌ మినరల్స్‌పై తీవ్ర దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. 


కొత్తవాటికి పది రెట్లు 

కొత్తగా గనులు, క్వారీలకు లీజు పొందాలనుకునే వారికి ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. గనులు, క్వారీలకు లీజులు తీసుకోవాలంటే ఏటా పది రెట్లు డెడ్‌ రెంట్లు కట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. గనుల లీజు గడువు ముగిసిన తర్వాత చేసుకునే రెన్యువల్స్‌కు కూడా పది రెట్ల డెడ్‌ రెంట్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇది రెన్యువల్స్‌ చేసుకునే లీజు దారులకు ఉరితాడులా ఉందని పలువురు పారిశ్రామికవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై కొత్తగా గనులకు లీజుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని పారిశ్రామికవర్గాలు వాపోతున్నాయి. 

 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో ప్రభుత్వ గనులశాఖ నుంచి ఆదాయం పిండుకునేందుకే బాదుడుకు తెర లేపిందన్న చర్చ సాగుతోంది. గతంలో డోలమెట్‌ ఖనిజానికి టన్నుకు రూ.140 చెల్లించేవారు. ప్రస్తుతం దానిపై రూ.100 పెరిగింది. గ్రానైట్‌పై రాయల్టీ 50 శాతం పెరిగింది. ఇలా ప్రభుత్వం అన్ని రకాల ఖనిజాల రాయల్టీపై ఎడాపెడా బాదేసింది. దీంతో గనులు, మైనర్‌ మినరల్స్‌ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. రాయల్టీలు భారీగా పెంచడం వల్ల చిన్న తరహా పరిశ్రమలు కుదేలయ్యే పరిస్థితి ఉందని పారిశ్రామికవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 


జీవో 65ను రద్దు చేయాలి..

కరోనా పరిస్థితులతో గ్రానైట్‌ పరిశ్రమల్లో ఉత్పత్తులు సగానికి తగ్గిపోయాయి. గనులు, క్వారీలపై డెడ్‌ రెంట్లు ఐదు రెట్లకు పెంచడం అన్యాయం. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 65ను వెంటనే రద్దు చేయాలి. లేదంటే చిన్న తరహా పరిశ్రమల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది. గ్రానైట్‌ ఫ్యాక్టరీలను మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం పునరాలోచించి చిన్న పరిశ్రమలను ఆదుకోవాలి. 

- బైసానిరాజు, గ్రానైట్‌ ఫ్యాక్టరీ యజమాని, డోన


  

Updated Date - 2021-08-21T05:36:16+05:30 IST