ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?

ABN , First Publish Date - 2021-09-04T05:29:30+05:30 IST

ప్రజల ప్రాణాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులకు లెక్క లేదా అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు.

ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?
బాలుడి తల్లిని ఓదారుస్తున్న అఖిలప్రియ

  1. శిరివెళ్లలో బాధిత కుటుంబానికి మాజీ మంత్రి అఖిలప్రియ పరామర్శ


శిరివెళ్ల, సెప్టెంబరు 3: ప్రజల ప్రాణాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులకు లెక్క లేదా అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. శిరివెళ్లలోని బలిజపేటలో జ్వరం బారినపడి మృతి చెందిన చిన్నారి నాగ మోక్షిత్‌ తల్లిదండ్రులను ఆమె శుక్రవారం పరామర్శించారు. చిన్నారి మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిని అఖిలప్రియ ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రజల సమ స్యలు తీర్చే తీరిక లేకుండా పోయిందని విమర్శించారు. బలిజపేట వాసులు వైసీపీకి ఓట్లు వేయలేదని పనులు చేయకపోవడం అధికారులకు తగదన్నారు. గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో కాలనీలో మురుగు నీరు పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందడం ద్వారానే బాలుడు జ్వరంతో మృత్యువాత పడ్డాడని అఖిలప్రియ ఎదుట మహిళలు వాపోయారు.  దీంతో పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయుడుతో అఖిలప్రియ ఫోన్‌లో మాట్లాడారు. గ్రామంలో ఎక్కడ చూసినా డ్రేనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, రెండు రోజుల్లో శిరివెళ్లలోని అన్ని కాలనీల్లో పారిశుధ్యం మెరుగుపరచకపోతే తామే సొంత నిధులు వెచ్చించి పనులు చేయిస్తామన్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి ప్రజా రోగ్యాన్ని మెరుగుపరచాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయుడును ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు యామా గుర్రప్ప, సూరా రామ, పీపీ లింగమయ్య, బాలచంద్రుడు, రవి, లింగమయ్య, భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డి, శివరామిరెడ్డి, లక్ష్మీరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.Updated Date - 2021-09-04T05:29:30+05:30 IST