సమస్యలు విన్నవించినా పట్టించుకోరా..?

ABN , First Publish Date - 2021-12-31T05:18:46+05:30 IST

వార్డులో సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు పట్టించుకోవడంలేదని టీడీపీ కౌన్సిలర్‌ పార్వతి అధికారులను నిలదీశారు.

సమస్యలు విన్నవించినా పట్టించుకోరా..?

  1.  కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌


ఆదోని టౌన్‌, డిసెంబరు 30: వార్డులో సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు పట్టించుకోవడంలేదని టీడీపీ కౌన్సిలర్‌ పార్వతి అధికారులను నిలదీశారు. గురువారం చైర్‌పర్సన్‌ బి.శాంత అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ వార్డులో 27 మందికి పింఛన్లు మంజూరు కాలేదని, వార్డులో నీటి సమస్యతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కౌన్సిలర్‌ వైజీ బాలాజీ మాట్లాడుతూ పట్టణంలో ప్లాను మంజూరు లేకుండానే అనేక నిర్మాణాలు చేస్తున్నారన్నారు. అనుమతుల్లేని నిర్మాణాల యజమానులకు నోటీసులను సచివాలయం సిబ్బంది ఇస్తారని కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ తెలిపారు. కుక్కల బెడద తొలగించాలని, పురపాలక పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, కొత్త నీటి పైపుల ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. డిసెంబరు 8న మరణించిన ఆర్మీ జవానులకు అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమను కమిషనర్‌ సభకు పరిచయం చేశారు. ఎంఈ సత్యనారాయణ, డీఈ సురేష్‌, ఏఈ మదన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:18:46+05:30 IST