జిమ్మిక్కులు చేయడం వైసీపీ నైజం

ABN , First Publish Date - 2021-08-25T05:30:00+05:30 IST

జిమ్మిక్కులు చేయడమే వైసీపీ ప్రభుత్వ నైజమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ ధ్వజమెత్తారు.

జిమ్మిక్కులు చేయడం వైసీపీ నైజం

  1. నాలుగు లక్షల మందికే అగ్రి గోల్డ్‌ పరిహారమా ?
  2. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌


నంద్యాల, ఆగస్టు 25: జిమ్మిక్కులు చేయడమే వైసీపీ ప్రభుత్వ నైజమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ ధ్వజమెత్తారు. బుధవారం రాజ్‌థియేటర్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది రూ.20వేల లోపు అగ్రిగోల్డ్‌ బాధితులు ఉంటే నాలుగు లక్షల మందికే పరిహారమా అని ప్రశ్నించారు. అధికారంలోకొస్తే ఆరు నెలల్లోగా అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న జగన్‌ అధికారంలోకొచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అరకొర నిధులు విదిలించి ప్రచారాన్ని మాత్రం ఆర్భాటంగా చేసుకుంటున్నారని అన్నారు. మిగతా రెండు లక్షల మంది డిపాజిటర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు నారా చంద్రబాబునాయుడు డిస్ట్రిక్ట్‌ లీగల్‌ అథారిటీ సర్వీస్‌ ద్వారా రూ.10వేల లోపు డిపాజిటర్లందరినీ ఆదుకోవడానికి రూ.250 కోట్లు కేటాయించి, అగ్రి గోల్డ్‌ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన రూ.50 కోట్లు మొత్తం రూ.300 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారని అన్నారు. అప్పట్లో ఎన్నికల నియమావళి ఉందని నిధులు విడుదల చేయనీయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అగ్రి గోల్డ్‌ బాధితులను ఆదుకోవడానికి కేటాయించిన రూ.336 కోట్లలో రూ.265 కోట్లు మాత్రమే జగన్‌ అగ్రిగోల్డ్‌ బాధితులకు సోమవారం విడుదల చేశారని, మిగతా నిధులను దారి మళ్లించి తాను ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుండ టం హాస్యాస్పదంగా ఉందన్నారు. అగ్రి గోల్డ్‌ నిందితులతో సీఎం జగన్‌ కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైనార్టీల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారే తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని అన్నారు. పేద ముస్లిం యువతుల వివాహాలకు టీడీపీ ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సాయం అందించిందని, అధికారంలోకి వస్తే రూ.లక్ష ఇస్తామన్న వైసీపీ దుల్హన్‌ పథకాన్ని అమలు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో పుట్టగతుల్లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఫరూక్‌ అన్నారు.



Updated Date - 2021-08-25T05:30:00+05:30 IST