మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు

ABN , First Publish Date - 2021-12-08T05:51:24+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల మంచితన్నాన్ని అలుసుగా తీసుకోవద్దని, వెంటనే పీఆర్సీ అమలుతో పాటు సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం వంటి 71 డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు
మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు

  1.  పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు నెరవేర్చాల్సిందే
  2.  ఆర్థిక మంత్రి బుగ్గన చులకనగా మాట్లాడడం సరికాదు
  3.  కర్నూలులో ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నేతలు


కర్నూలు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల మంచితన్నాన్ని అలుసుగా తీసుకోవద్దని, వెంటనే పీఆర్సీ అమలుతో పాటు సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం వంటి 71 డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీజేఏసీ జిల్లా చైర్మన సీహెచ వెంగళరెడ్డి అధ్యక్షతన కర్నూలు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో మంగళవారం ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నేతల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఏపీజేఏసీ-అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటించాలంటూ ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు, ఆఖరికి సీఎం జగనమోహనరెడ్డికి కూడా విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో ఉద్యమానికి సిద్ధమయ్యామన్నారు. రాష్ట్రంలోని 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కర్నూలు నుంచే ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నెలలో ఏదో ఒక రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వస్తుంది కదా హేళనగా మాట్లాడడం తగదన్నారు. పీఆర్సీ అమలు చేయకపోయినా, డీఏలు బకాయిలు ఉన్నా కరోనా కాలంలో రెండు నెలలు వేతనాలు అలస్యంగా ఇచ్చినా ప్రభుత్వాన్ని ఏమీ అనలేదని గుర్తు చేశారు. ఉద్యోగుల నుంచి తమపై ఒత్తిడి వచ్చినా ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అగాఽథం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపిక పట్టామన్నారు. 

-  ఏపీజేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగుల ఐక్యకార్యాచరణను కర్నూలు నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా సీఎస్‌ ప్రభుత్వ సంఘాలను మభ్యపెడుతున్నారన్నారు. తమ 71 డిమాండ్లకు సంబంధించి సీఎస్‌కు ఈ నెల 1న వినతి పత్రం ఇచ్చి ఈ నెల 6 వరకు సమయం ఇచ్చామని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమ కార్యాచరణను మొదలుపెట్టామన్నారు. 2018 నుంచి పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య కొంతమంది నాయకులు చిచ్చుపెట్టాలని చూస్తున్నారన్నారు. 90 శాతం ప్రజలకు 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులు సేవలందిస్తున్న తీరును ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. వైద్య, విద్యా శాఖలో ప్రవేశపెట్టిన యాప్‌లను రద్దు చేయాలన్నారు. ప్రైమరీ పాఠశాలలను ఉన్నత పాఠశాలలో కలిపివేయడం, ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం వల్ల వచ్చే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

-  ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ గురించి ప్రభుత్వ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టామన్నారు. తాము దాచుకున్న రూ.1,600 కోట్లు కూడా ప్రభుత్వం వాడుకుందని, వాటిని ఎపుడు చెల్లిస్తారని అడిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. పీఆర్సీ నివేదికలో డీఏ, పీఎఫ్‌ వంటి అంశాలన్నీ ఉంటాయని, ఆ నివేదికను ప్రభుత్వ ఉద్యోగులకు చూపించిన తర్వాతే ఆమోదించాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఎందకు చూపించడం లేదని ప్రశ్నించారు.  కేవలం రూ.15 వేలు జీతం తీసుకుంటున్న సచివాలయ ఉద్యోగులకు మిగతా ప్రభుత్వ పథకాలను మినహాయించడం తగదని, వారికి రాయితీలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ-అమరావతి జిల్లా చైర్మన నాగరమణయ్య, ఏపీ రెవెన్యూ అసోసియేషన జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి, ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి జవహర్‌లాల్‌, ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T05:51:24+05:30 IST