ఫిబ్రవరి 12 నుంచి జిల్లా స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు

ABN , First Publish Date - 2022-01-01T05:29:44+05:30 IST

ఫిబ్రవరి 12, 13వ తేదీలలో జిల్లాస్థాయి పౌరాణిక, చారిత్రాత్మక ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహిస్తున్నామని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు.

ఫిబ్రవరి 12 నుంచి జిల్లా స్థాయి  ఏకపాత్రాభినయ పోటీలు


కర్నూలు (కల్చరల్‌), డిసెంబరు 31:  ఫిబ్రవరి 12, 13వ తేదీలలో జిల్లాస్థాయి పౌరాణిక, చారిత్రాత్మక ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహిస్తున్నామని  టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. శుక్రవారం కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల వివరాలు వెల్లడించారు. జిల్లాలోని రంగస్థల కళాకారులను ప్రోత్సహించేందుకు ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో రెండు రోజుల ఏకపాత్రాభినయ పోటీలు నాటక  అభిమానులకు అలరిస్తాయని తెలిపారు. పోటీలలో పాల్గొనే కళాకారులకు పౌరాణిక పాత్రలకు ప్రథమ బహుమతి రూ.8వేలు, ద్వితీయ బహుమతి రూ.6వేలు, తృతీయ బహుమతి రూ.4వేలు, అయిదు కన్సొలేషన బహుమతుల కింద రూ.వెయ్యి చొప్పున కళాకారులకు అందజేస్తామని తెలిపారు. చారిత్రక ఏకపాత్ర పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.3వేలు, తృతీయ బహుమతి రూ.2వేలు అందజేయనున్నట్లు తెలిపారు. కళాకారులు తగిన వేషధారణతో ప్రదర్శన ఇవ్వాలని, పౌరాణిక, చారిత్రక పాత్రలనే పోటీలకు అంగీకరిస్తామని తెలిపారు. పాత్రలు 15 నిముషాల నిడివి కలగి, రాగయుక్తంగా పద్యాలాపన ఉండాలని, హోర్మోనియం, కీబోర్డులను పోటీదారులే సమకూర్చుకోవాలని సూచించారు. పోటీ ఉన్న రోజున కళాకారులకు భోజనవసతి కల్పిస్తామని, కళాకారులు తమ పేరు, చిరునామా, పోటీలకు ప్రదర్శించే పాత్రపేరును జనవరి 31లోగా కళాక్షేత్రం కోశాధికారి ఎనకే కాంతారావు, వాట్సాప్‌ నెం. 93938 11097కు పంపుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి మహ్మద్‌ మియా, కోశాధికారి కాంతారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T05:29:44+05:30 IST