నక్షత్ర హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగుల తొలగింపు

ABN , First Publish Date - 2021-10-31T06:03:44+05:30 IST

టీడీపీ హయాంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నియమించిన 47 మంది నక్షత్ర హౌస్‌ కీపింగ్‌ సర్వీస్‌ అండ్‌ ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్లను శనివారం తొలగిస్తూ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

నక్షత్ర హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగుల తొలగింపు

కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 30: టీడీపీ హయాంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నియమించిన 47 మంది నక్షత్ర హౌస్‌ కీపింగ్‌ సర్వీస్‌ అండ్‌ ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్లను శనివారం తొలగిస్తూ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూలై 31వ తేదీన ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రోగులను వార్డులకు స్టెచర్లను తీసుకుని వెళ్లేందుకు డీఎంఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం వీరిని నియమించింది. ఈ మేరకు ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. పీడీ అకౌంట్‌ లేకపోవడంతో వీరిని తొలగించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని బోధనాసపత్రుల్లో నక్షత్ర ఉద్యోగులు కొనసాగుతున్నా కర్నూలు జీజీహెచ్‌లో తొలగించడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలో రోగుల తరలింపులో విశేష సేవలందించారు. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు కీలక పాత్ర వహించారు. అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నా ఇక్కడ మాత్రమే తొలగించడం అన్యాయమని హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డిని వివరణ కోరగా ఏజెన్సీ కొనసాగింపుపై ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో నోటీసులు  జారీ చేశామని తెలిపారు.

Updated Date - 2021-10-31T06:03:44+05:30 IST