నిరసనలపై నిర్బంధం

ABN , First Publish Date - 2021-10-21T05:21:05+05:30 IST

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఇంటిపై వైసీపీ నాయకులు, కార్యకర్తల దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బుధవారం నిరసనలు తెలియజేసింది.

నిరసనలపై నిర్బంధం
ఎమ్మిగనూరులో బీవీని ఇంట్లోనుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసులు

  1. టీడీపీ ముఖ్య నాయకుల హౌస్‌ అరెస్ట్‌
  2. శాంతియుత ఆందోళనలకూ అడ్డగింత
  3. ఇళ్ల వద్దనే బైఠాయించిన నాయకులు
  4.  ప్రభుత్వ తీరును ఎండగట్టిన పార్టీ శ్రేణులు


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 20: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఇంటిపై వైసీపీ నాయకులు, కార్యకర్తల దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బుధవారం నిరసనలు తెలియజేసింది. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో వైసీపీ తీరును ఎండగడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. పోలీసుల నుంచి అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురైనా వెరకుండా నిరసన గళం వినిపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో ఆ పార్టీ ముఖ్య నాయకు లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయినా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. 

ముఖ్య నాయకుల నిర్బంధం

ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పార్టీ ఇనచార్జిలు తిక్కారెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఎమ్మిగనూరులో పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే జయనాగే శ్వరరెడ్డి తన ఇంటివద్దే బైఠాయించారు. ముఖ్యమంత్రి జగన తీరును తీవ్రంగా విమర్శించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్‌ రెడ్డిని లద్దగిరిలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజ కవర్గాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. మంత్రాలయంలో పార్టీ నియోజకవర్గ ఇనచార్జి తిక్కారెడ్డి ఇంటిని తెల్లవారుజామునే పోలీసులు చుట్టుముట్టారు. బంద్‌లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. ఆలూరు నియోజకవర్గంలో పార్టీ సీనియర్‌ నాయకుడు దేవేంద్రప్ప ఇంటి నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకుని హౌస్‌ అరెస్టు చేశారు. పత్తికొండలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డిని, బండి ఆత్మకూరులో టీడీపీ మండల అధ్యక్షుడు పులిపాటి నరసింహారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. హొళగుందలో టీడీపీ కన్వీనర్‌ వీరన్నగౌడు, బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన రెడ్డిని, నంద్యాలలో పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎనఎండీ ఫరూక్‌ను, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు నిర్బంధించి వారి ఇళ్లల్లోకి తీసుకెళ్లారు.

రోడ్డెక్కిన తమ్ముళ్లు..

నందికొట్కూరు, తుగ్గలి మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. తుగ్గలిలో జిల్లా పరిషత మాజీ చైర్మన బత్తిన వెంకటరాముడు, మండల కన్వీనర్‌ తిరుపాల్‌నాయుడు తదితరులు ధర్నా చేస్తుండగా పోలీసులు అడ్డుకుని స్టేషనకు తరలించారు. పోలీస్‌స్టేషనలో వారిని నిర్బంధించారు. వెల్దుర్తి, గోనెగండ్ల మండల కేంద్రాల్లో టీడీపీ నాయకులు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బండి ఆత్మకూరులో శాంతియుతంగా ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు బలవంతంగా లాగేశారు. గూడూరులో కోడుమూరు నియోజకవర్గ ఇనచార్జి ఆకెపోగు ప్రభాకర్‌ను పోలీస్‌స్టేషనకు తరలించి నిర్బంధించారు. బేతంచెర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్నూలు-నంద్యాల క్రాస్‌ రోడ్డులో బైఠాయించారు. అనంతరం కొత్తబస్టాండు నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. డోనలో టీడీపీ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, వలసల రామకృష్ణ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన మురళీకృష్ణ తదితరులు వైసీపీ పాలన తీరును తీవ్రంగా విమర్శిస్తూ నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషనకు తరలించారు.

జిల్లా కేంద్రంలో..

కర్నూలు నగరంలో టీడీపీ నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ప్రజల్లో ఆగ్రహావేశాలు తెప్పించాయి. తెల్లవారుజాము 4 గంటలకే పోలీసులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి ఆయనను గృహనిర్బంధం చేశారు. పోలీసుల చర్యలను సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర కుమార్‌ ఎండగట్టారు. కల్లూరులో గౌరు వెంకటరెడ్డి, పాణ్యం పార్టీ ఇనచార్జి గౌరు చరిత, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన పెరుగు పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. పోలీసుల కళ్లుగప్పి పార్టీ కార్యాలయానికి చేరుకున్న తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్‌ తదితరులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యమంత్రి జగన ప్రోద్బలంతోనే రాష్ట్ర రాజధా నిలో తమ పార్టీ కార్యాలయాన్ని వైసీపీ నాయకులు ధ్వంసం చేశారని, ముఖ్య నేతలపై దాడులు చేసి గాయపరిచారని అబ్బాస్‌ ఆరోపించారు. జగన రాక్షసపాలనపై ఇప్పటికే ప్రజల్లో ఏవగింపు మొదలైందని, త్వరలోనే ప్రజా ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. రోడ్డుపై ధర్నా చేస్తున్న అబ్బాస్‌తో పాటు హనుమంతరావు చౌదరి, జేమ్స్‌, కొరకంచి రవికుమార్‌, బజారన్న, గట్టు తిలక్‌, ప్రవీణ్‌ రామాంజినేయులు తదితరులను పోలీసులు టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి గదిలో నిర్బంధించారు. 


Updated Date - 2021-10-21T05:21:05+05:30 IST