ఆన్‌లైన్‌ అవినీతి!

ABN , First Publish Date - 2021-08-22T05:18:11+05:30 IST

రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతికి ఆన్‌లైన్‌ చలనాలే కారణమని తెలుస్తోంది.

ఆన్‌లైన్‌ అవినీతి!
నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం (ఫైల్‌ )

  1. రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రభుత్వాదాయానికి గండి
  2. చలానాలు కట్టించుకునేందుకు బ్యాంకర్ల విముఖత
  3. స్టాంప్‌ రైటర్ల లైసెన్స్‌లతో సర్దుబాటు 


నంద్యాల, ఆగస్టు 21: రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతికి ఆన్‌లైన్‌ చలనాలే కారణమని తెలుస్తోంది. బ్యాంకులు చలనాలు జారీ చేయకపోవడంతో ఆన్‌లైన్‌ పద్ధతి అవినీతికి ఆజ్యం పోసినట్టయింది. ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన చలానాల సొమ్మును తీసుకోడానికి నంద్యాల పట్టణంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లు దాదాపుగా విముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో డాక్యుమెంట్‌ రైటర్లు.. కస్టమర్ల చలానాలను తమ బ్యాంకు అకౌంట్లలో జమ చేసుకుని ఆన్‌లైన్‌ చలానాలు తీస్తున్నారు. ఇటీవల సీఎఫ్‌ఎంఎస్‌ సిస్టంతో ఇంటర్నెట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చలానాల విధానం అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల సులభంగా చలనాల వ్యవహారంలో మార్ఫింగ్‌ చేసి అంకెలు మార్చి ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు. బ్యాంకుల్లో చలానాల సొమ్ము చెల్లిస్తున్నప్పుడు ధ్రువీకరణ పత్రం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. 


 బ్యాంకుల ప్రధాన శాఖల్లో మాత్రమే చలానాలు తీసుకునే విధానం ఉంది. రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించిన లావాదేవీల్లో ఎక్కువ శాతం చలానాల కోసం బ్యాంకులకు వెళుతుంటారు. అయితే గ్రామీణ ప్రజలకు చలానాల చెల్లింపులపై అవగాహన ఉండదు. వారు స్టాంప్‌ రైటర్లపై ఆధారపడతారు. రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి చలానాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్యాంకర్లు కారణాలు నేరుగా చెప్పకుండా దరఖాస్తులను తిరస్కరిస్తుంటారు. సర్వర్‌ మొరాయించిందని, వేరే బ్రాంచ్‌కు వెళ్లమని చెబుతుంటారు. ఫలితంగా ఆన్‌లైన్‌ చలానాలతో ప్రభుత్వాదాయానికి గండి పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం రాష్ట్రంలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గోల్‌మాల్‌ జరుగుతోంది. ఈ వ్యవహారం ఇటీవల బట్టబయలైంది. 


సమగ్ర ఆడిట్‌కు.. 


నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 54 చలానాలలో రూ.7.39 లక్షల గోల్‌మాల్‌ వ్యవహారం నేపథ్యంలో సమగ్ర ఆడిట్‌కు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన స్టాంప్‌రైటర్ల నుంచి సొమ్మును రికవరీ చేసి, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ గోల్‌మాల్‌ కేవలం ఈ 54 చలానాలకు సంబంధించిందేనా.. లేక అంతకుముందు నుంచి కూడా జరుగుతున్నదా? అనేది తేల్చడానికి సమగ్ర ఆడిట్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో ఆన్‌లైన్‌ చలనాలే కారణమని తెలుస్తోంది. 


కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ రాక ఆలస్యంతో..


జిల్లాలోనే అత్యధిక ఆదాయం ఉన్న నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం లో గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 స్థాయిలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తున్నారు. బోగస్‌ చలానాల వ్యవహారంలో గ్రేడ్‌-1 సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న సోఫియాబేగం సస్పెండ్‌ అయ్యారు. గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న వారికి పదోన్నతి కల్పించి గ్రేడ్‌-1 సబ్‌ రిజిస్ట్రార్‌గా నియ మించారు. ఇందులో భాగంగా ఎమ్మిగ నూరులో పని చేస్తున్న సునందను నంద్యాల ఎస్‌ఆర్‌-1గా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. అయితే పదోన్నతి, బదిలీ ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఆమె ఇంకా నంద్యాలలో చార్జి తీసుకోలేదు. దీంతో నంద్యాల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పాలనాపరమైన కొరత స్పష్టంగా అగుపి స్తోంది. ఆడిట్‌ కూడా నెమ్మదించినట్లు తెలుస్తోంది. 


ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి 


చలానాలు తీసుకోడానికి బ్యాంకుల్లో ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేయాలి. గతంలో చాలా సార్లు పలువురు సబ్‌ రిజిస్ర్టార్లు నేరుగా బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లి సమస్యను విన్నవించారు. ఆన్‌లైన్‌ మోసాలు జరగకుండా చెక్‌ పెట్టాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి.         

    - వెంకటేశ్వర్లు, స్టాంప్‌ రైటర్‌, నంద్యాల

 

చలానాలు తీసుకోవడం లేదు 


నంద్యాల ఎస్‌బీఐ ప్రధాన శాఖలు, ఇతర శాఖల్లో కూడా చలానాలు తీసుకోవడం లేదు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా బ్యాంకు అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వానికి చెల్లించే సొమ్ములో ఎక్కువ శాతం రూ.లక్షల్లో రిజిస్ట్రేషన్ల ద్వారానే సమకూరుతుంది. బ్యాంకుల్లో చలానాలు తీసుకుంటే ఆన్‌లైన్‌ మోసాలు జరగవు. స్టాంప్‌ రైటర్లకు లైసెన్స్‌లను పునరుద్ధరించాలి. అప్పుడే ఆన్‌లైన్‌ మోసాలు ఆగుతాయి. 


- మోహన్‌రావు, సీనియర్‌ లైసెన్స్‌డ్‌ స్టాంప్‌ రైటర్‌, నంద్యాల 


చలానాలు తీసుకుంటున్నాం 


రిజిస్ట్రేషన్‌ శాఖ చలానాలను బ్యాంకుల్లో తీసుకుంటున్నాం. ఎస్‌బీఐ ప్రధాన శాఖతోపాటు పట్టణంలోని అన్ని శాఖల్లో కూడా చలానాలు తీసుకుంటున్నాం. బ్యాంకులు ప్రజా సేవకే పని చేస్తున్నాయి. చలానాలు తీసుకోవడం లేదని వస్తున్న ఆరోపణలు అవాస్తవం. 


- ప్రసాదరెడ్డి, చీఫ్‌ మేనేజర్‌, ఎస్‌బీఐ, నంద్యాల

Updated Date - 2021-08-22T05:18:11+05:30 IST