కర్ఫ్యూతో రోడ్లన్నీ నిర్మానుష్యం
ABN , First Publish Date - 2021-05-06T05:24:26+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

- మూతపడిన దుకాణాలు
నంద్యాల (ఎడ్యుకేషన్), మే 5: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. నంద్యాలలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రజలు బయటకు రాకపోవడంతో రోడ్లు, ప్రధాన కూడలీలు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం ప్రజలు తమ అవసరాల కోసం దుకాణాల వద్దకు చేరుకొని నిత్యావసర వస్తువులు తీసుకున్నారు. ఆ సమయంలో 144 సెక్షన్ అమలులో ఉన్నా ఎక్కడా అది జరగలేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది దుకాణాలను మూసివేయాలని మైక్‌ల ద్వారా విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని అన్ని దుకాణాలను మూసివేయించారు. సాయంత్రం ప్రజలు అడప దడప రోడ్లపైకి వచ్చారు. పోలీసులు వారిని వెనక్కి పంపించారు.
ఓర్వకల్లు: కర్ఫ్యూతో మండలంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బుధవారం తహసీల్దార్ శివరాముడు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఓర్వకల్లు, హుశేనాపురం, సోమయాజులపల్లె, నన్నూరు, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు తదితర గ్రామాల్లో పర్యటించారు. ప్రజలకు పలు సూచనలిచ్చారు. హోటళ్లు, వైన్‌షాపులను, కిరాణ దుకాణాలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్కు లేని వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఉదయం 6నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలన్నారు. ఓర్వకల్లులో సర్పంచ్ తోట అనూష ఆధ్వర్యంలో గ్రామంలో హైపో ద్రావణాన్ని వీధుల్లో పిచికారీ చేశారు.
ఆళ్లగడ్డ: ఆళగడ్డ పట్టణంలో పగటి కర్ఫ్యూతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులను 12 గంటల వరకు మాత్రమే అధికారులు తిప్పారు. ఆటోలు సైతం తిరగలేదు. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ రామాంజనేయులు, కమిషనర్ కిశోర్ పట్టణంలో కలియ తిరిగారు. అలాగే మండంలోని గ్రామాల్లో కూడా పగటి కర్ఫ్యూను రూరల్ పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేశారు. గ్రామాల్లోని రచ్చ బండల వద్ద ఎవరు సమావేశం కాకుండా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
రుద్రవరం: కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని తహసీల్దార్ వెంకటశివ అన్నారు. బుధవారం ఆలమూరు, రుద్రవరం గ్రామాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వం కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించడంతో షాపుల యజమానులు సహకరించి 12 గంటలకు మూసి వేయాలని అన్నారు.
చాగలమర్రి: సెకండ్ వేవ్ కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల తరువాత అన్ని దుకాణాలను మూసి వేయాలని ఆళ్లగడ్డ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్ హెచ్చరించారు. బుధవారం చాగలమర్రి గాంధీ సెంటర్‌లో కర్ఫ్యూ పరిస్థితిని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వారాలపాటు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. కర్ఫ్యూతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన వీధులు, వ్యాపార కూడళ్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. వారపు సంతమార్కెట్‌ను మధ్యాహ్నం వరకే నిర్వహించారు.
గడివేముల: కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నాగమణి హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపద్యంలో ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తుందని అన్నారు. బుధవారం ఆమె గడివేములలోని వ్యాపార సముదాయాలను మూసి వేయించారు. ఆటోల్లో పరిమిత సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాసులు, వీఆర్వో సామన్న పాల్గొన్నారు.
దొర్నిపాడు: కరోనా నేపథ్యంలో బుధవారం నుంచి రెండు వారాలపాటు కర్ఫ్యూ విధించినట్లు ఎస్‌ఐ కీర్తి తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని రకాల షాపులు తెరుచుకోవచ్చని అన్నారు. 12 గంటల తరువాత గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు.