వివాదంగా మారిన చేపల వేట

ABN , First Publish Date - 2021-08-28T05:09:10+05:30 IST

ప్రభుత్వం చేపట్టిన నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో గ్రామాలలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

వివాదంగా మారిన చేపల వేట
సుగాలిమెట్ట తండా వాసులు గాలేరు నగరి కాల్వలో వేసిన చేపల వల

  1. కొత్త గ్రామానికి ఏర్పాటు కాని రెవెన్యూ పరిధి
  2. గాలేరు, నగరి మాదేనంటూ రెండు గ్రామాల వివాదం


పాణ్యం, ఆగస్టు 27: ప్రభుత్వం  చేపట్టిన నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో గ్రామాలలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట సమీపంలోని గాలేరు, నగరి కాల్వలో చేపల కోసం సుగాలిమెట్ట తండా వాసులు వేసిన వలలు రెండు గ్రామాల మధ్య వివాదానికి దారి తీశాయి. కాల్వలో చేపలు పట్టుకునే హక్కు తమదే నంటూ పాణ్యం ఇందిరానగర్‌కు చెందిన చెంచులు, సుగాలిమెట్ట తండా వాసులు వాగ్వాదానికి దిగారు. ఈ సమస్యపై పాణ్యం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. 500ల జనాభా గల గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో 18 గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఈ ఆదేశాలతో పాణ్యం పరిధిలోని సుగాలిమెట్ట గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది. సుగాలిమెట్టకు మజరాగా గోరుకల్లు తండాను ఏర్పాటు చేశారు. గ్రామ సమీపంలోని గాలేరు నగరి కాల్వలో చేపలు పట్టుకోవడానికి చెంచులు, సుగాలీలు వలలు వేయడంతో వివాదం చోటుచేసుకుంది కాల్వ తమ పరిఽధిలో ఉందని, చేపల వేట తమ జీవనాధారమని చేపలు పట్టుకోవడానికి తమకే హక్కు ఉందని పాణ్యం మాజీ సర్పంచ్‌, వీటీడీఏ సభ్యుడు  మేకల సుబ్బరాయుడు పేర్కొన్నారు. కాగా తమ పరిధిలో కాల్వ ఉందని గ్రామాభివృద్ధికి తమకు ఎటువంటి వనరులు లేవని సుగాలిమెట్ట ఉప సర్పంచ్‌ రామనాయక్‌ తెలిపారు. కాగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన గ్రామాలకు నివాస ప్రాంతాల వరకు మాత్రమే పంచాయతీలుగా గుర్తించినట్లు, రెవెన్యూ, ఆర్థిక వనరులను ఏర్పాటు చేయలేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.  ప్రస్తుతం ఈ సమస్యపై సంబంధిత అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. 


నివాస ప్రాంతాల వరకే పరిధి.. 

 సుగాలిమెట్టను పంచాయతీగా గోరుకల్లు తండాను మజరాగా 2019 ఫిబ్రవరి 20న ప్రభుత్వం ప్రకటించింది. కాగా పంచాయతీకి కేటాయించిన సర్వే నెంబర్లలో గ్రామం వరకే పరిధి ఉంది. రెవెన్యూ పంచాయతీగా అనుమతి లేదు. గాలేరు నగరి కాల్వ ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందని రెవెన్యూ అఽధికారులు నిర్ణయించాల్సి ఉంది. 

- భాస్కరరావు, ఈవోఆర్డీ, పాణ్యం Updated Date - 2021-08-28T05:09:10+05:30 IST