ముగిసిన మొహర్రం

ABN , First Publish Date - 2021-08-20T05:30:00+05:30 IST

ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో పెద్దహుసేని పీర్ల దేవుడు స్వామివారిని దర్శించుకుని హారతి ఇచ్చారు.

ముగిసిన మొహర్రం
హొళగుందలో పీర్లను చూసేందుకు తరలి వచ్చిన భక్తులు

కౌతాళం, ఆగస్టు 20: ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో పెద్దహుసేని పీర్ల దేవుడు స్వామివారిని దర్శించుకుని హారతి ఇచ్చారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. శుక్రవారం మొహర్రం వేడుకలో భాగంగా పెద్ద హుసేని పీరు తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న అర్చకులు పీర్ల దేవుడికి హారతి పట్టారు. తరువాత ఈరన్న స్వామికి మహా మంగళ హారతి పట్టారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ సంస్కృతి అనాదిగా వస్తోందని, మత సామరస్యానికి ప్రతీకగా ఈ వేడుక నిలుస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

- గురువారం కౌతాళంలోని పెద్దలు, జాగిర్దార్‌ల ఇళ్లకు దర్గా వంశస్తుల ఆధ్వర్యంలో మేల్‌ జయలు దేరింది. మేల్‌ తిరిగి దర్గాకు చేరిన అనంతరం సరిగెత్తు వేడుకలు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం నగర్‌కానీతో జండాపూని ఎద్దుల బండిని జనాలు లాగారు. అనంతరం బుక్కిట్టు దేవుడిగా పిలిచే వ్యక్తి భిన్న వేషధారణలతో దేవుడి ప్రసాదాన్ని భక్తులకు పంచుతూ పరుగులు పెట్టారు. సరిగెత్తు పూర్తయిన అనంతరం దఫన్‌ కార్యక్రమం నిర్వహించారు.

గోనెగండ్ల: త్యాగానికి ప్రతీకగా కులమతాలకతీతంగా, హిందూ ముస్లింలు జరుపుకునే మెహర్రం వేడుకలు శుక్రవారం మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఘనంగా జరిగాయి. భక్తులు పెద్దఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం పీర్ల చావిడిల దగ్గర పీర్లస్వాముల సవారి నిర్వహించారు. అనంతరం పీర్లను గ్రామ శివార్ల దగ్గర ఉన్న పురాతన బావి దగ్గరకు తీసుకువెళ్లారు. రాత్రి అక్కడి నుంచి అరబ్‌ బాషాలో శోకిస్తూ చావిడిల దగ్గరకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నందవరం: కులమతాలకు అతీతంగా జరుపుకునే మొహర్రం వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. మండలంలోని ముగతి, నాగలదిన్నె, హలహర్వి, కనకవీడు, నదీకైరవాడి, పెద్దకొత్తిలి, తదితర గ్రామాలల్లో మొహర్రం పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముగతిలో భక్తులు దవడలకు కత్తులతో గుచ్చుకున్న వేషధారణ ప్రత్యేకంగా నిలిచింది.  

పెద్దకడబూరు: మండలంలోని అన్ని గ్రామాల్లో తప్పటె దరువులతో యువకులు అలాయి చుట్టూ చిందులు వేస్తూ కులమతాలకతీతంగా పీర్ల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. శుక్రవారం చివర రోజు కావడంతో పీర్లకు మొక్కుబడులు తీర్చుకున్నారు. గ్రామ ప్రధాన వీధుల్లో మేళ తాళాల మధ్య పీర్లను ఊరేగించి సమీప వంకలు, కాలువల్లో నిమజ్జనానికి తరలించారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఎస్‌ఐ శ్రీనివాసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. 

మంత్రాలయం/ఎమ్మిగనూరు టౌన్‌: మంత్రాలయంలో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాతూరు కొలువుదీరిన పెద్ద, చిన్న పీర్లను తుంగభద్రనది వరకు ఊరేగించారు. ఎమ్మిగనూరు మండలంలోని పలు గ్రామాల్లో పీర్లను అలాయి చుట్టూ ఊరేగించి గ్రామ శివారులో నిమజ్జనం చేశారు. 

ఆదోని రూరల్‌: మండలంలోని మొహర్రం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. మాజీ ఎంపీ వైసీపీ నాయకురాలు బుట్టా రేణుక కుటుంబ సభ్యులతో కలిసి తన సొంత ఊరు బాలాదూర్‌లో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక పూజలు చేపట్టారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

ఆదోని(అగ్రికల్చర్‌): పట్టణంలో కులమతాలకతీతంగా జరుపుకునే మొహర్రం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మూడు రోజుల కింద దర్గాలలో పీర్లను ప్రతిష్టించారు. ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రతి రోజూ పీర్లను ప్రతిష్ఠించిన ప్రాంతంలో భక్తులు అగ్నిగుండం చుట్టూ ఆలాయ్‌ తొక్కుతూ జరుపకున్నారు. ప్రతిష్టించిన పీర్లను ఊరేగింపుగా ఏటికి తరలించారు. ఖాజీపుర ప్రాంతంలో ముస్లింలు మాతం నిర్వహించారు. 

దేవనకొండ: దేవనకొండతోపాటు మండలంలోని కుంకనూరు. పొట్లపాడు, ఆలారుదిన్నె, తెర్నేకల్లు, డి.కోటకొండ, కె.వెంకటాపురం తదితర గ్రామాలలో శుక్రవారం మొహర్రం వేడుకలు ముగిశాయి. ఉదయం నుంచే ఆయా గ్రామాల్లో పీర్లకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పీర్లను సాయంత్రం మేళతాళాల మధ్య ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. కార్యక్రమాలను తిలకించేందుకు ఆయా గ్రామాలలో అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 





Updated Date - 2021-08-20T05:30:00+05:30 IST