జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయం
ABN , First Publish Date - 2021-11-06T04:28:57+05:30 IST
కొలిమిగుండ్ల జడ్పీటీసీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో అధిష్ఠానం ఆదేశాల మేరకు పోటీ చేయడం లేదని టీడీపీ మండల అధ్యక్షుడు మూలె రామేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు.

కొలిమిగుండ్ల, నవంబరు 5: కొలిమిగుండ్ల జడ్పీటీసీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో అధిష్ఠానం ఆదేశాల మేరకు పోటీ చేయడం లేదని టీడీపీ మండల అధ్యక్షుడు మూలె రామేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు. జడ్పీటీసీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించి కొలిమిగుండ్ల టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. మూలె రామేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత జడ్పీటీసీ ఎన్నికల్లో జడ్పీటీసీగా ఎర్రబోతుల వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఆయన అకాలంగా మృతి చెందడంతో తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ప్రకారం మరణించిన అభ్యర్థి స్థానానికి పోటీ చేయడం ఉండదని, ఇందులో భాగంగానే ప్రస్తుతం కొలిమిగుండ్ల జడ్పీటీసీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పోటీ చేస్తున్న ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారుడు ఎర్రబోతుల పాపిరెడ్డికి పోటీగా తమ పార్టీ అభ్యర్థిని నిలపడం లేదన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, నారా లోకే్‌షబాబు, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకొని కార్యకర్తల అభిప్రాయాలను సేకరించామన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని వివరించారు. కార్యక్రమంలో అవుకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవీ పక్కీరారెడ్డి, మండల ప్రచార కార్యదర్శి శివరామిరెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు గొంగటి హుస్సేనరెడ్డి, అందె రాము, కామిని భాస్కర్‌రెడ్డి, తోట శివారెడ్డి పాల్గొన్నారు.
సిద్ధాపురం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయం
ఆత్మకూరు, నవంబరు 5: సిద్ధాపురం ఎంపీటీసీగా గుండునాయక్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. అయితే అదే ఏడాది ఆగస్టు 15న ఆయన గుండెపోటుతో మృతిచెందారు. సిద్ధాపురం ఎంపీటీసీ మృతిచెందడంతో ఆ స్థానంలో ప్రస్తుతం ఉప ఎన్నిక నోటిఫికేషనను విడుదల చేశారు. శుక్రవారానికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఇందులో గుండునాయక్ భార్య లక్ష్మీదేవి, కుమారుడు రాంబాబునాయక్ మాత్రమే వైసీపీ తరుపున నామినేషన వేశారు. ఈ క్రమంలోనే గుండునాయక్ కుటుంబసభ్యులు శుక్రవారం బేతంచెర్లలో నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిని, నంద్యాల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డిలను కలిసి సిద్ధ్దాపురం ఉప ఎన్నిక ఏకగీవ్రమయ్యేందుకు సహకరించాలని కోరారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బుడ్డా స్పందిస్తూ మృతి చెందిన ఎంపీటీసీ స్థానానికి అదే కుటుంబం నుంచి అవకాశం ఇస్తుండటంతో టీడీపీ పోటికి దూరంగా వుంటుందని హామీ ఇచ్చారు. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో పార్టీ అనుసరిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదిలావుంటే 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గుండునాయక్ కుమారుడు రాంబాబునాయక్ తన నామినేషనను వితడ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే గుండునాయక్ భార్య లక్ష్మీదేవీ ఏకగీవ్రంగా ఎన్నిక కానున్నారు.