ధర్మ రక్షణకు క ట్టుబడి ఉండాలి
ABN , First Publish Date - 2021-01-20T05:46:06+05:30 IST
ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని త్రిదండి చిన జీయర్ స్వామి ఉద్బోధించారు.

త్రిదండి చిన జీయర్ స్వామి
కర్నూలు(కల్చరల్), జనవరి 19: ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని త్రిదండి చిన జీయర్ స్వామి ఉద్బోధించారు. మంగళవారం స్థానిక దేవీ ఫంక్షన్ హాలులో సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వధర్మ ఆచరణ మహాయజ్ఞం, బంధు సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఏ మతాలు లేవని, కాలగమనంలో అనేక మతాలు వచ్చినా ఎవరి మత విశ్వాసాలు వారివేనని అన్నారు. మతం మనిషికి క్రమశిక్షణ నేర్పేలా ఉండాలని, ఇతర మతాలను గౌరవించేలా మనిషి ఎదగాలని అన్నారు. మన దేవుళ్లను పూజించుకుందామని, అలాగే మనది కానిదాన్ని గౌరవిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు మంచిది కాదని, దీని ప్రభావం సమాజంపై చూపిస్తుందని అన్నారు. హిందూ ఆలయాలపై ఓ పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలకు ఎవరైనా రావచ్చని, ఇందుకు నిబంధనలేవీ లేవని వెయ్యేళ్ల క్రితం రామానుజార్యులు తెలియజేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో త్రిదండి అహోబల స్వామి పాల్గొన్నారు.