నెత్తురోడిన హైవే

ABN , First Publish Date - 2021-10-20T05:40:10+05:30 IST

ఆళ్లగడ్డ పట్టణ శివారులోని ప్రభుత్వ గోదాములకు సమీపంలో 40వ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు.

నెత్తురోడిన హైవే
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

  1. కారు ఢీకొని ముగ్గురు దుర్మరణం
  2. ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
  3. బాధితులు శిరివెళ్ల భవన నిర్మాణ కార్మికులు
  4. టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపు తప్పిన కారు
  5. డివైడర్‌ను దాటుకొని వచ్చి ఢీకొన్న వైనం


ఆళ్ల్లగడ్డ్డ/శిరివెళ్ల, అక్టోబరు 19: ఆళ్లగడ్డ పట్టణ శివారులోని ప్రభుత్వ గోదాములకు సమీపంలో 40వ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. కారు టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న నలుగురిని ఢీకొట్టింది. దీంతో శిరివెళ్లకి చెందిన అఫ్జల్‌ హుసేన్‌ (22), ముల్లా అబ్దుల్‌ కలాం(20), హుసేన్‌ బాషా(19) అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న చిన్నవంగలి సర్పంచ్‌ రాచం జగదీశ్వర రెడ్డి, రోడ్డు పక్కన ఉన్న సులేమాన్‌ గాయపడ్డారు. వీరిని ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


పనికి వెళ్లి తిరిగొస్తూ..


శిరివెళ్లకు చెందిన అఫ్జల్‌, కలాం బేల్దారి పనికి ఆళ్లగడ్డకు వెళ్లారు. పని ముగిశాక బైక్‌పై తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన హుసేన్‌ బాషా, సులేమాన్‌ ఆళ్లగడ్డ పట్టణ శివారులోని గోదాముల వద్ద కనిపించారు. దీంతో బైకును రోడ్డుపక్కన ఆపి నలుగురూ మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో కర్నూలు నుంచి చాగలమర్రికి వెళుతున్న ఏపీ 21 బీహెచ్‌ 8481 నెంబరు గల కారు ముందరి టైరు పంక్చర్‌ అయింది. దీంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని దూసుకువెళ్లి రోడ్డుపక్కన ఉన్న నలుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. కారులో ఉన్న జగదీశ్వరరెడ్డి భార్య సురక్షితంగా బయటపడ్డారు. 


ఇంటి బాధ్యతలు మోసే కష్టజీవులు


రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురూ పేద కుటుంబాలవారు. రోజూ బేల్దారి పనులకు వెళ్లి కుటుంబాలను పోషించేవారు. చేతికి వచ్చిన యువకులు ఇలా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చే యువకులు విగతజీవులుగా మారడంతో తలిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మిలాద్‌ ఉన్‌ నబీ పండగ రోజు చోటు చేసుకున్న ప్రమాదంతో శిరివెళ్లలో విషాదం నెలకొంది. 


 శిరివెళ్లలోని చాంద్‌బాడాకు చెందిన మహమ్మద్‌ రఫి, కుర్షీద్‌ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కొడుకు షేక్‌ అఫ్జల్‌ హుసేన్‌ తన అన్న, తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. భవన నిర్మాణంలో సెంట్రింగ్‌ పని చేసేవాడు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను పంచుకున్నాడు. ఈ ప్రమాదంతో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాదంలో మునిగింది. 


 శిరివెళ్లలోని ముల్లాన్‌పేటకు చెందిన షేక్‌ జమాల్‌ బాషాకు ఇద్దరు సంతానం. జమాల్‌ బాషా పెయింటింగ్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న కుమారుడు షేక్‌ హుసేన్‌ బాషా సెంట్రింగ్‌ పని నేర్చుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అలాంటి యువకుడికి నూరేళ్లు నిండడంతో తల్లిదండ్రు లు భోరున విలపిస్తున్నారు. 


 శిరివెళ్లలోని ముల్లాన్‌పేటకు చెందిన ముల్లా అబ్దుల్‌ కలాం కొన్నేళ్లుగా సెంట్రింగ్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అబ్దుల్‌ కలాంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం కోసం నిత్యం శ్రమించే అబ్దుల్‌ కలాం రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. 


సులేమాన్‌ పరిస్థితి విషమం 


శిరివెళ్లలోని అబ్దుల్‌ గఫార్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వీరిలో చిన్నవాడైన సులేమాన్‌, స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సెలవు రోజుల్లో సెంట్రింగ్‌ పనికి వెళుతుంటాడు. ఓ వైపు చదువుకుంటూ మరో వైపు తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్న సులేమాన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సులేమాన్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 


పరిశీలించినడీఎస్పీ


ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర, పట్టణ సీఐ కృష్ణయ్య, రూరల్‌ సీఐ రాజశేఖరరెడ్డి, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కారు టైరు పంక్ఛర్‌ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ తెలిపారు. వాహనదారులు టైర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు చూసుకొని ప్రయాణం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు.

Updated Date - 2021-10-20T05:40:10+05:30 IST