భూమి పూజ వివాదాస్పదం

ABN , First Publish Date - 2021-06-22T04:51:41+05:30 IST

ఆలూరు పట్టణంలోని గాంధీనగర్‌, సిద్ధేశ్వర కాలనీలలో రూ.120 లక్షలతో వేస్తున్న పైపులైన్‌ పనులు వివాదాస్పదంగా మారాయి.

భూమి పూజ వివాదాస్పదం

ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై సర్పంచ్‌ అభ్యంతరం

ఆలూరు, జూన్‌ 20: ఆలూరు పట్టణంలోని గాంధీనగర్‌, సిద్ధేశ్వర కాలనీలలో రూ.120 లక్షలతో వేస్తున్న పైపులైన్‌ పనులు వివాదాస్పదంగా మారాయి. ఆదివారం ఉప సర్పంచ్‌ రవితోపాటు వైసీపీ నాయకులు భూమి పూజ చేశారు. అయితే ప్రొటోకాల్‌ పాటించకుండా సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తుండటంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. సెలవు కావడంతో అధికారులు కూడా ఎవరు హాజరు కాలేదు. తనకు సమాచారం ఇవ్వకపోవడంపై టీడీపీ సర్పంచ్‌ అరుణాదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ నిధులతో వైసీపీ నాయకులు పైపులైన్‌ పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు ఉప సర్పంచ్‌తోపాటు మెజార్టీ సభ్యులు తమ పార్టీ వారే అని, తప్పకుండా తమ పనులకు కూడా తీర్మానం ఇవ్వాల్సిందేనని వైసీపీ ఉప సర్పంచ్‌ రవి, వైసీపీ వార్డు సభ్యులు అంటున్నారు. దీంతో అధికారులపై సర్పంచ్‌, వైస్‌ సర్పంచ్‌ వర్గాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో ఇలాగైతే తమకు ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు వాపోతున్నారు. ఇద్దరూ సమన్వయంతో వెళితే అభివృద్ధితోపాటు తమకు ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు. కాగా ఆలూరు గ్రామ పంచాయతీలో రెండు వీధుల్లో పైపులైన్‌ పనులు వేసేందుకు మంత్రి జయరామ్‌ సూచన మేరకు అప్పటి ప్రత్యేక అధికారి తీర్మానం మేరకు పనులు చేసేందుకు అనుమతి ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి నాగభూషన్‌రావు వివరిస్తున్నారు.

Updated Date - 2021-06-22T04:51:41+05:30 IST