‘బీసీలను నిర్లక్ష్యం చేస్తే పుట్టగతులుండవు’

ABN , First Publish Date - 2021-07-09T05:25:02+05:30 IST

దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను ఏ పార్టీ నిర్లక్ష్యం చేసినా పుట్టగతులు ఉండవని.. ఎన్నటికీ అధికారంలోకి రావడం కల్ల అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ ఆయా పార్టీల నేతలకు హెచ్చరించారు.

‘బీసీలను నిర్లక్ష్యం చేస్తే పుట్టగతులుండవు’

కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 8: దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను ఏ పార్టీ నిర్లక్ష్యం చేసినా పుట్టగతులు ఉండవని.. ఎన్నటికీ అధికారంలోకి రావడం కల్ల అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ ఆయా పార్టీల నేతలకు హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లను రిజర్వు చేయాలని ఆమోదం తెలపడంపై నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. అదే విదంగా ఈ తీర్మానాన్ని అడ్డుకున్న బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెర్నాండేజ్‌ దిష్టిబొమ్మను బీసీ సంఘాల నేతలు దగ్ధం చేశారు. గురువారం నగరంలోని బీసీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మురళీ మనోహర్‌, జాతీయ అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు ఆధ్వర్యంలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వై.నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బీసీ సంఘాల నేతలు అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ నేతలను కలిసి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో తీర్మానించాలని ఒత్తిడి చేస్తన్నామని, ఇందులో భాగంగానే మహారాష్ట్రలో తీర్మానాన్ని శాసనసభ ఆమోదిస్తూ కేంద్రానికి పంపిందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-07-09T05:25:02+05:30 IST