మంత్రి ప్రోత్సాహంతోనే దళితుల ఇళ్లపై దాడులు

ABN , First Publish Date - 2021-12-28T05:30:00+05:30 IST

పెద్దగోనేహాల్‌ గ్రామంలో దళతుల ఇళ్లపై వాల్మీకుల దాడులు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రోత్సాహంతోనే జరిగాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌జే ప్రకాష్‌ మాదిగ ఆరోపించారు.

మంత్రి ప్రోత్సాహంతోనే  దళితుల ఇళ్లపై దాడులు
ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

  1. వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి
  2. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌జే ప్రకాష్‌ మాదిగ


ఆలూరు, డిసెంబరు 28: పెద్దగోనేహాల్‌ గ్రామంలో దళతుల ఇళ్లపై వాల్మీకుల దాడులు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రోత్సాహంతోనే జరిగాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌జే ప్రకాష్‌ మాదిగ ఆరోపించారు. ఈ ఘటనకు ప్రోత్సహించిన వారిపై కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం దళితుల ఇళ్లపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆలూరు అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన పెద్దగోనేహల్‌ గ్రామంలో దళితుల ఇళ్లపై వాల్మీకులు దాడి చేశారన్నారు. ఇళ్లను కూడా కూలగొట్టారన్నారు. తమ వర్గానికి చెందిన మంత్రి ఉన్నాడనే ధైర్యంతో వాల్మీకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. దాడికి ముందు రోజు మంత్రి జయరాం స్వయంగా దళితుల ఇళ్లను కొట్టివేయండని తన వర్గానికి చెప్పడం నిజం కాదా? అన్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్‌ కూడా సోషల్‌ మీడియాలో వచ్చాయన్నారు. జయరాంను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంత జరిగినా కలెక్టర్‌, ఎస్పీ గ్రామాన్ని సందర్శించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌ హుసేనసాబ్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర నాయకుడు సాయిరాం, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు బొందిమడుగుల రమేష్‌, రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు మందా కృష్ణయ్య, జిల్లా నాయకుడు ముత్యాల గదిలింగ, తాలుకా అధ్యక్షుడు కత్తి రామాంజనేయులు, టీడీపీ నాయకులు బిల్లేకల్‌ వెంకటేష్‌, కొమ్ము రామాంజి, సీపీఎం నాయకుడు నారాయణస్వామి, సంచార జాతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, ఎంపీటీసీ ఇంగలదహాల్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

-  ఈ ఘటనపై మంత్రి జయరాం పెద్దగోనేహల్‌కు చెందిన ఓ వ్యక్తితో ఫోనలో మాట్లాడిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


Updated Date - 2021-12-28T05:30:00+05:30 IST