జిల్లాకు ఏం ఇచ్చారు?

ABN , First Publish Date - 2021-05-21T05:51:15+05:30 IST

ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జిల్లాకు నిరాశ మిగిల్చింది. అతి ముఖ్యమైన ఇరిగేషన్‌కు అరకొర నిధులు ఇచ్చారు.

జిల్లాకు ఏం ఇచ్చారు?

  1. శ్రీశైలం నిర్వహణ నిధులకు చుక్కెదురు
  2. మేజర్‌ ఇరిగేషన్‌కు రూ.363.15 కోట్లు
  3. కేసీ కెనాల్‌కు రూ.8.55 కోట్లు మాత్రమే
  4. సుంకేసుల డ్యాంకు రూ.1.20 కోట్లు
  5. తెలుగుగంగ ప్రాజెక్టుకు రూ.632.60 కోట్లు 
  6. తుంగభద్ర బోర్డుకు రూ.124 కోట్లు
  7. వ్యవసాయ రంగానికి అరకొర విదిలింపులు 


కర్నూలు, మే 20(ఆంధ్రజ్యోతి): ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జిల్లాకు నిరాశ మిగిల్చింది. అతి ముఖ్యమైన ఇరిగేషన్‌కు అరకొర నిధులు ఇచ్చారు. మేజర్‌ జలవనరుల శాఖకు రూ.363 కోట్లు కేటాయించగా, తెలుగు గంగ ప్రాజెక్టుకు రూ.632.30 కోట్లు ఇచ్చారు. ఇందులో జిల్లా వాటా రూ.2కోట్ల లోపే. కేసీ కెనాల్‌కు రూ.8.55 కోట్లు ఇచ్చారు. జిల్లాకు సంబంధించి సుంకేసులకు కేటాయించింది రూ.1.20 కోట్లు మాత్రమే ఊరట కలిగించే విషయం. వ్యవసాయ రంగానికి కూడా అరకొరగా నిధులిచ్చారు. శ్రీశైలం డ్యాం నిర్వహణకు రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. డ్యాం నిర్వహణపై ఇప్పటికే పలు అనుమానాలు రేకెత్తుతున్న తరుణంలో బడ్జెట్‌ పెంచాల్సిన ప్రభుత్వం.. మొండిచేయి చూపడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


కర్నూలు మేజర్‌ ఇరిగేషన్‌


జిల్లాలోని మేజర్‌ జలవనరుల ప్రాజెక్టులకు ఏటా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుంటారు. ఈసారి కూడా నిధులు కేటాయించినా జిల్లాకు ఒరిగేది పెద్దగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2021-22 సంవత్సరం బడ్జెట్‌ కింద రూ.363.15 కోట్లను కేటాయించారు. 2019-20లో 206.13 కోట్లు ఇచ్చారు. 2020-21 సంవత్సరంలో 437.28 కోట్లు కేటాయించిన పిదప దాన్ని రూ.241.93 కోట్లుగా సవరించారు. ఇందులో జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీశైలం కుడిగట్టు(నీలం సంజీవరెడ్డి సాగర్‌)కు రూ.34 కోట్లను కేటాయించినా డ్యాం నిర్వహణకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పటికే డ్యాం నిర్వహణ ఇబ్బందులతో కూడి ఉన్నదని, ప్లంజ్‌ పూల్‌తో పునాదుల్లో ప్రమాదం ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తుంగభద్ర దిగువ కాలువకు రూ.30.32 కోట్లను కేటాయించారు. ఎల్లెల్సీతో పాటు వేదవతి, ఆర్టీఎస్‌కు కలిపి రూ.30.32 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే గురురాఘవేంద్ర స్వామి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు ఈ బడ్జెట్‌లో 308.96 కోట్లు ఇచ్చారు. 2019-20లో రూ.55.11 కోట్లు కేటాయించగా, 2020-21లో సవరించిన పిదప రూ.209.44 కోట్లను కేటాయించారు. ఈసారి మరింత పెంచారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు గతంలో రూ.48లక్షలు, రూ.3.14 కోట్లు వరుసగా కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో రూ.7.85 కోట్లు ఇచ్చారు. వరదరాజ స్వామి గుడి ప్రాజెక్టుకు కూడా రూ.7.85 కోట్లను కేటాయించినట్లుగా ప్రకటించారు. సిద్ధాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.14.49 కోట్లను ఇచ్చారు. చీఫ్‌ ఇంజనీర్‌(ప్రాజెక్ట్సు) నీటి పారుదల కేంద్ర ప్రాజెక్టు సిబ్బందికి రూ. 89.45 కోట్లను కేటాయించారు. 


బడ్జెట్‌ వివరాలు 

ఫ ఎన్టీఆర్‌ తెలుగు గంగ ప్రాజెక్టు కింద జీతాలు, ఉద్యోగుల భృతి, ప్రయాణ, కార్యాలయ ఖర్చులు, అద్దెలు, పన్నులు, వేతన బకాయిలు, ప్రకటనలు, ప్రచార ఖర్చులు వెరసి రూ.70.98 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కింద జిల్లాకు ఒరిగిందేమీ లేకపోగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకే అధికంగా ఉపయోగాలున్నాయి. ఆ జిల్లాల్లోని సోమశిల స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌, సోమశిల ప్రాజెక్టు, పెన్నానది కాలువ, కందలేరు లిఫ్ట్‌, కృష్ణాపురం రిజర్వాయర్‌ తదితరాలకు కలిపి రూ. 632.60 కోట్లు ఇచ్చారు. 2019-20లో రూ.189 కోట్లు కేటాయించగా, 2020-21 సంవత్సరంలో రూ.273 కోట్లు కేటాయించగా చివరకు రూ.258.94 కోట్లుగా సవరించారు. 

తుంగభద్ర బోర్డుకు 2019-20లో రూ.342.88 కోట్లను కేటాయించగా, 2020-21లో తగ్గించి రూ.162.70 కోట్లుగా చూపించారు. ఈసారి బడ్జెట్‌లో కూడా తగ్గిస్తూ రూ.124 కోట్లను కేటాయించారు. 


వ్యవసాయ ప్రగతి కాగితాల్లోనే..


కర్నూలు(అగ్రికల్చర్‌), మే 20: బడ్జెట్‌లో జిల్లాకు వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.738.46 కోట్లను కేటాయించారు. మొదటి బడ్జెట్‌లోనే రైతులకు పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు వ్యవసాయ యాంత్రీకరణ కోసం నిధులను పెద్ద ఎత్తున ఖర్చు చేస్తామని ప్రకటించారు. అయితే అయితే రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేయలేదు. సున్నావడ్డీ పథకం కింద ఈ ఏడాది రూ.500 కోట్లను కేటాయించారు. 2019 ఖరీఫ్‌కు సంబంధించి రైతులు తీసుకున్న రుణాలకు మాత్రమే నెల క్రితం నిధులను విడుదల చేశారు. 2020 ఖరీఫ్‌, రబీ పంటల సాగు కోసం రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీని ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ధరల స్థిరీకరణ నిధి కింద గత సంవత్సరం రూ.3 వేల కోట్లను కేటాయిస్తే.. ఈసారి కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చారు. 


అంకెల గారడీతో మభ్యపెట్టారు


నంద్యాల, మే 20: బడ్జెట్‌లో అంకెల గారడీతో ప్రజలందరినీ మభ్యపెట్టారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాన్ని బహిష్కరిస్తూ టీడీపీ ఆన్‌లైన్‌లో నిర్వహించిన మాక్‌ అసెంబ్లీ సమావేశంలో ఎన్‌ఎండీ ఫరూక్‌ పాల్గొన్నారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి మాక్‌ అసెంబ్లీ సమావేశాన్ని ఆన్‌లైన్‌లో ఆ పార్టీ నిర్వహించింది. అనంతరం ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ 2021-22 బడ్జెట్‌లో కేటాయింపులన్నీ అంకెల గారడీనేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ అమలు తదితర వాటిని ప్రస్తావించకపోవడం ఉద్యోగ వర్గాలను మోసం చేయడమేనన్నారు. ఒక రోజు బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించిన ఘనత వైసీపీ పాలకులకే దక్కిందన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు సమగ్రంగా చర్చలో పాల్గొనాల్సి ఉంటుందని, అయితే వైసీపీ ప్రభుత్వం ఒక రోజు బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించి అంకెల గారడీ చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగడానికి, కట్టడి చేయలేకపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో విద్య, వైద్య రంగాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం భావ్యం కాదన్నారు. 

- ఎన్‌ఎండీ ఫరూక్‌, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు 


కాగితాల్లోనే నిధుల లెక్కలు 


  1. వాస్తవంగా ఖర్చు పెట్టేది శూన్యమే
  2. సోమిశెట్టి వెంకటేశ్వర్లు 


కర్నూలు(అగ్రికల్చర్‌), మే 20: ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే అంకెల గారడీ తప్ప మరేమీలేదని తెలుగుదేశం పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గురువారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాగితాల్లోనే నిధుల లెక్కలు చూపిస్తున్నారని, ఖర్చు పెట్టేది మాత్రం శూన్యమని అన్నారు. అతిముఖ్యమైన బడ్జెట్‌ సమావేశాలను ఒకే ఒక్క రోజుతో మమ అని అనిపించారన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు నిధుల లెక్కలు చూపడం తప్పితే.. వాటిని ఎక్కడి నుంచి తీసుకువస్తారో చెప్పలేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం జరగడంలేదని, ఉన్న పరిశ్రమలు కూడా బయటి రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు. 

Updated Date - 2021-05-21T05:51:15+05:30 IST