బడి కోసం ఆందోళన
ABN , First Publish Date - 2021-10-29T05:21:01+05:30 IST
పట్టణంలోని మసూదియా అరబిక్ ఎయిడెడ్ పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

- ఆర్డీవో కార్యాలయం ముట్టడి
ఆదోని(అగ్రికల్చర్), అక్టోబరు 28: పట్టణంలోని మసూదియా అరబిక్ ఎయిడెడ్ పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఏళ్ల చరిత్ర ఉన్న పాఠశాలను మూసివేయడం తగదని విద్యార్థులు, తల్లిదండ్రులు అంటున్నారు. ప్రభుత్వం, పాఠశాల యాజమాన్యం తీరుకు నిరసనగా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పట్ణణంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంతో మంది మైనార్టీ విద్యార్థుల ఉన్నతికి కారణమైన పాఠశాలను ఎలా మూసివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో విలీనానికి ఒప్పుకుంటూ లిఖితపూర్వకంగా ఇచ్చిన లేఖను పాఠశాల యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. వందల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించి ఆర్డీవో రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి వినతిపత్రం అందించారు. అరబిక్ పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఖాదర్‌బాషా, పటేల్ రషీద్ అహ్మద్, షేక్ అహ్మద్, జిక్రియా, సిరాజ్, ఇస్సాక్, హర్షద్, ముజీబ్ఖాద్రీ పాల్గొన్నారు.