అన్నీ సమస్యలే

ABN , First Publish Date - 2021-09-02T06:09:23+05:30 IST

‘ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయి’ అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతోంది.

అన్నీ సమస్యలే
డి.బెళగల్‌లో ఒకే తరగతిలో 110 మంది విద్యార్థులు

  1. ఇంగ్లీష్‌, సోషల్‌ ఉపాధ్యాయులు లేరు
  2. ప్రాథమిక పాఠశాల గదుల్లో సర్దుబాటు
  3. తాగునీటి కొళాయి వద్ద డ్రైనేజీ నీరు
  4. నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం
  5. డి బెళగల్‌ ఉన్నత పాఠశాల దుస్థితి


కోసిగి, సెప్టెంబరు 1: ‘ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయి’ అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. కానీ క్షేత్రస్థాయికి వెళితే పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తాయి. ఇందుకు ఉదాహరణ కోసిగి మండల పరిధిలోని డి.బెళగల్‌ జిల్లా పరిషత ఉన్నత పాఠశాల. గదుల కొరత, అపరిశుభ్రత, అభద్రత, కొవిడ్‌ భయం, ఉపాధ్యాయుల కొరత.. ఇలా అనేక సమస్యలు పీడిస్తున్నాయి. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు 324 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఉన్నత పాఠశాలకు ప్రత్యేక భవనం లేదు. ప్రాథమిక పాఠశాల గదుల్లో మూడింటిని వినియోగిస్తున్నారు. ఒక్క 6వ తరగతిలోనే 110 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ఒకే గదిలో కింద కూర్చుని  పాఠాలు వింటున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య 20 మందికి మించకూడదు. కానీ ఇక్కడ సగటున ఒక్కో గదిలో వంద మందికి పైగా విద్యార్థులు కూర్చుంటున్నారు.


సర్దుబాటు చదువులు

డి.బెళగల్‌ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 9 గదులు ఉన్నాయి. ఉన్నత పాఠశాలకు ప్రత్యేక భవనం లేకపోవడంతో ఇక్కడే సర్దుకుంటున్నారు. రెండు గదుల్లో ‘నాడు-నేడు’ పనుల సామగ్రి, ఫర్నిచర్‌ డంప్‌ చేసి తాళాలు వేశారు. రెండు గదులను ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్టాఫ్‌ రూమ్‌లుగా మార్చారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న 290 మంది విద్యార్థులకు రెండు గదులను కేటాయించారు. 6 నుంచి 10వ తరగతి వరకూ ఉన్న 324 మంది విద్యార్థులకు మూడు గదులు ఇచ్చారు. ఇలా ఏ గదిలో చూసినా వంద మందికి పైగానే కూర్చోవాల్సి వస్తోంది. 


రూ.33.42 లక్షలను ఏం చేశారు..?

నాడు-నేడు కింద ఈ పాఠశాలలో రూ.33,42,498 ఖర్చు చేశారు. పెయింటింగ్‌, ఎలకి్ట్రకల్‌, మేజర్‌, మైనర్‌ మరమ్మతులు చేయడంతోపాటు ఫ్యాన్లు, ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులు చర్చించినట్లు తెలిసింది. ఉన్నత పాఠశాలకు కేటాయించిన తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడేలా ఉంది. పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకుగానూ ముగ్గురు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ముగ్గురు సెలవుల్లో ఉన్నారని ఇనచార్జి ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర తెలిపారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర దేశాయ్‌ ఏడాదిగా డెప్యుటేషనపై ఎస్‌ఎస్‌ఏలో ఉన్నారు. ఇంగ్లీష్‌, సోషల్‌కు ఉపాధ్యాయులు లేరు. ఇలా ఐతే తమ పిల్లలకు చదువు ఎలా వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం ముందు వర్షపు నీరు నిలిచింది. మధ్యాహ్న భోజనానికి నేలపై కూర్చుంటున్నారు. తాగునీటిక కొళాయి చుట్టూ మురుగునీరు నిలబడింది. 


 గుడిలో బడి

కోడుమూరు(రూరల్‌), ఆగస్టు 26: మండల పరిధిలోని రామాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మాణం కోసం కూల్చేశారు. తాత్కాలికంగా గ్రామంలోని రామాయలంలోకి పాఠశాలను మార్చారు. భవన నిర్మాణ పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టరు పునాదులు తవ్వి వదిలేశాడు. అది మొదలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2018లో రామాలయానికి చేరిన బడి.. ఇప్పటికీ అక్కడే కొనసాగుతోంది. ఆలయంలో బడిగంట, గుడిగంట.. రెండూ మోగుతుంటాయి. స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించే సమయంలో విద్యార్థులు వరండాలోకి చేరుతారు. భక్తులు వెళ్లిపోయిన తరువాత తిరిగి గుడిలోకి వెళ్లి చదువుకుంటారు. 


చదువు అబ్బేదెలా..?

వర్షం వస్తే గుడి కారుతుంది. ఈ కారణంగా విద్యార్థుల కథల పుస్తకాలు తడిచిపోయాయి. వాటిని ఆరబెట్టిన సమయంలో కొన్ని పుస్తకాలు పోయాయి. విద్యార్థులకు గుడి వరండానే క్రీడామైదానం. అక్కడే ఆడుకుంటారు. ఆలయంలో బడి ఉన్నకారనంగా మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు వడ్డించడం లేదు. బదులుగా పచ్చి గుడ్లను ఇళ్లకు ఇచ్చి పంపుతున్నారు.  ఇక్కడ 18 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో నాడు-నేడు పనులకు ఎంపిక కాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. గ్రామస్థులు అభ్యంతరం తెలపడంతోనే పాఠశాల భవన నిర్మాణ పనులు ఆగిపోయాయని ఎంఈవో అనంతయ్య తెలిపారు. దీంతో పాఠశాల కోసం 10 సెంట్లు భూమి తహసీల్దారు కేటాయించారని తెలిపారు. ఈ విషయాన్ని సమగ్ర శిక్ష అధికారులకు తెలియజేశామని అన్నారు. నిధులు మంజూరైన వెంటనే పాఠశాల భవనం నిర్మిస్తామని తెలిపారు. 


 తరగతి గదులకు తాళం

ఆదోని(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 1: పట్టణంలోని పురపాలక ఉన్నత పాఠశాలకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యాలయం ఇది. 6 నుంచి పదో తరగతి వరకు 1,540 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్న 24 తరగతి గదులు సరిపడటం లేదు. అదనపు గదులు నిర్మించలేదు. ఇది చాలదన్నట్లు అధికారులు ఈ గదుల్లోనే వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఉపాధ్యాయులు కొన్ని తరగతులను చెట్ల కింద నిర్వహిస్తున్నారు. వార్డు సచివాలయాన్ని ఎత్తివేయాలని విద్యార్థిసంఘాలు ఆందోళనలు కూడా చేశాయి. అయినా అధికారులు పట్టించుకోలేదు. పాఠశాల ఆవరణల్లో ఉన్న సచివాలయాలు ఎత్తి వేయాలని హైకోర్డు ఆదేశించడంతో పురపాలక అధికారులు వార్డు సచివాలయాన్ని వేరేచోటుకు మార్చారు. అప్పటి వరకూ వినియోగించిన పాఠశాల తరగతి గదులకు తాళం వేసుకున్నారు. గదులను అప్పగించాలని ఉపాధ్యాయులు అడుగుతున్నా పట్టించుకోలేదు. మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ దగ్గరికి ఉపాధ్యాయులు వెళ్లి పాఠశాల గదులను అప్పగించాలని కోరారు. రెండు రోజుల్లో తాళాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పది రోజులైనా పట్టించుకోలేదు. ఇప్పటికీ తాళాలు వార్డు సచివాలయ ఆడ్మిన వద్దే ఉన్నాయి. అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గదులను అప్పగించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.  
Updated Date - 2021-09-02T06:09:23+05:30 IST