‘మత విద్వేషాలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలి’
ABN , First Publish Date - 2021-10-30T04:59:29+05:30 IST
త్రిపుర రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌డీపీఐ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అతావుల్లాఖాన్, పాపులర్ ఫ్రంట్ డివిజన్ అధ్యక్షుడు ఫాజిల్ దేశాయ్ డిమాండ్ చేశారు.
నంద్యాల టౌన్, అక్టోబరు 29: త్రిపుర రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌డీపీఐ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అతావుల్లాఖాన్, పాపులర్ ఫ్రంట్ డివిజన్ అధ్యక్షుడు ఫాజిల్ దేశాయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం త్రిపురలో మసీదులు, ముస్లింలపై కొనసాగుతున్న దాడులను ఖండిస్తూ నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతావుల్లా ఖాన్, ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మారణహోమాన్ని సృష్టించడం భవిష్యత్‌కు పెనుముప్పు కలగడం ఖాయమని అన్నారు. ఇలాంటి గూండాయిజాలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించి, అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్, ఇతర దేశాలను సాకుగా చూపి భారత్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌డీపీఐ అసెంబ్లీ అధ్యక్షుడు ఇక్బాల్‌బాషా, కార్యదర్శి అబూబకర్, పాపులర్ ఫ్రంట్ డివిజన్ కార్యదర్శి ఇద్రిస్ షేక్, జమాతె ఉలేమా హింద్ సంస్థ నాయకుడు ఖలీల్ మౌలానా, పలు ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.