159 గ్రామ పంచాయతీలు

ABN , First Publish Date - 2021-02-26T05:36:09+05:30 IST

జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం నజరానా ప్రకటించింది.

159 గ్రామ పంచాయతీలు

  1. ఏకగ్రీవాల నజరానాకు ఎంపిక చేసిన అధికారులు
  2. రూ.11.6 కోట్లు కావాలని ప్రతిపాదనలు


కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 25: జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. దీంతో ఏకగ్రీవమైన పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 4 స్లాట్లుగా విభజించి జిల్లా పంచాయతీ అధికారులు పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు గురువారం ప్రతిపాదనలు పంపారు. 2 వేలలోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలకు రూ. 5లక్షలు, 2 వేల నుంచి 5 వేల జనాభా గ్రామాలకు రూ.10 లక్షలు, 5 వేల నుంచి 10 లక్షల జనాభా గ్రామాలకు రూ.15 లక్షలు, 10 లక్షలకు పైగా జనాభా పంచాయతీలకు రూ.20 లక్షల నగదును ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఇవ్వనుంది. జిల్లాలో 161 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యారు. అయితే ఆత్మకూరు మండలం కొట్టాల చెరువులో వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే డోన్‌ మండలం కామగాని కుంట్ల గ్రామంలో 2 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. సర్పంచ్‌లతో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవం అయితేనే నజరానా వర్తిస్తుంది. 

దీంతో ఈ రెండు పంచాయతీలు ఏకగ్రీవం నుంచి తప్పుకున్నాయి. నిబంధనలకు లోబడి జిల్లాలో 159 పంచాయతీలు పోత్రాహకాలకు అర్హత సాధించాయి. ఇందులో 98 పంచాయతీలు రూ.5 లక్షల కేటరిగిలోనూ, రూ.10 లక్షల కేటగిరిలో 52 పంచాయతీలు, రూ.15 లక్షల కేటగిరిలో 6 పంచాయతీలు, రూ.20 లక్షల కేటగిరిలో 3 పంచాయతీలు ఉన్నాయి. రూ.20 లక్షల కేటగిరిలో బనగానపల్లె, అవుకు, ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల పంచాయతీలు ఉన్నాయి. నాలుగు కేటగిరిల్లో కలిపి మొత్తం రూ.11.60 కోట్లు నజరానా పంచాయతీలకు అందనుంది. 

Updated Date - 2021-02-26T05:36:09+05:30 IST