నామినేషన్ల హోరు.. యువత జోరు

ABN , First Publish Date - 2021-02-01T06:57:57+05:30 IST

పంచాయతీల్లో తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

నామినేషన్ల హోరు.. యువత జోరు
రామవరప్పాడులో నామినేషన్ల కోలాహలం

అర్ధరాత్రి వరకూ బారులు తీరిన అభ్యర్థులు

తొలిదశ ఎన్నికలకు ముగిసిన ప్రక్రియ

చివరి రోజు సర ్పంచ్‌లకు 871, వార్డు స్థానాలకు 5,531 నామినేషన్లు 

మొత్తం సర్పంచ్‌ స్థానాలకు 1379 , వార్డు స్థానాలకు 7,889 నామినేషన్లు 

అభ్యర్థుల్లో యువతే అధికం జూ విద్యాధికుల నుంచే అధికాసక్తి


పంచాయతీల్లో తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన ఆదివారం రికార్డు స్థాయిలో సర్పంచులు, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. రాత్రి పొద్దుపోయేవరకూ నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల కేంద్రాల వద్ద సాయంత్రం సమయంలో అభ్యర్థులు పోటెత్తటంతో పోలీసులు రంగంలోకి దిగి కట్టుదిట్టం చేయాల్సి వచ్చింది. 


(ఆంధ్ర జ్యోతి, విజయవాడ)

పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలకు సంబంధించి విజయవాడ డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగిసింది. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్న గ్రామాల్లో ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకూ సాగింది. సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్లు ముగియాల్సి ఉన్నా, అప్పటికే చాలామంది అభ్యర్థులు కేంద్రాల్లో బారులు తీరడంతో రాత్రి వరకు స్వీకరిస్తూనే ఉన్నారు.  


డివిజన్‌ పరిధిలోని 14 మండలాల్లో ఆఖరి రోజు సర్పంచ్‌ స్థానాలకు 871, వార్డు స్థానాలకు 5,531 నామినేషన్లు దాఖలయ్యాయి. వత్సవాయి మండలంలో గరిష్ఠంగా సర్పంచ్‌ స్థానాలకు 109, వార్డులకు 628 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజులుగా దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే, తొలిరోజు శుక్రవారం సర్పంచ్‌ స్థానాలకు 63, వార్డులకు 151 నామినేషన్లు దాఖలుకాగా, శనివారం సర్పంచ్‌ స్థానాలకు 445, వార్డులకు 2,211 నామినేషన్లు దాఖలయ్యాయి. 


సర్పంచ్‌ స్థానాలకు 1379 నామినేషన్లు

విజయవాడ డివిజన్‌ పరిధిలో మూడు రోజుల పాటు మొత్తం సర్పంచ్‌ స్థానాలకు 1,379, వార్డులకు 7,889 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసినవారిలో విద్యాధికులే అధికంగా ఉండడం విశేషం.  లాయర్లు, డాక్టర్లు కూడా నామినేషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు. 35 సంవత్సరాల్లోపు యువతే అధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఒక్కో అభ్యర్థి రెండుసెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, ఒక్కో గ్రామంలో సర్పంచ్‌ స్థానానికి నలుగురైదుగురు కూడా నామినేషన్లను దాఖలు చేశారు. విజయవాడ డివిజన్‌ పరిధిలో మొత్తం 234 గ్రామ పంచాయతీలకు చివరిగా బరిలో ఎందరు నిలిచేది నామినేషన్ల ఉపసంహరణ రోజు తెలుస్తుంది. 


వన్‌టౌన్లో ఉద్రిక్తం

అధికార పార్టీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారంటూ ఆదివారం రాత్రి విజయవాడ వన్‌టౌన్‌లోని కొత్తపేట పోలీసు స్టేషన్‌ ఎదుట టీడీపీ కార్యకర్తలు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నుంచి తమ పార్టీలో చేరిన కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారని, వారిపై ఫిర్యాదు చేసేందుకు వస్తే తమను పట్టించుకోలేదని టీడీపీ నాయకులు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు మాత్రం ఇది కుల వివాదం అని చెబుతున్నారు. 

Updated Date - 2021-02-01T06:57:57+05:30 IST