వైసీపీ, టీడీపీ బాహాబాహి

ABN , First Publish Date - 2021-10-21T06:53:36+05:30 IST

వైసీపీ - టీడీపీ కార్యకర్తలు బాహాబాహీ తలపడడంతో బుధవారం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

వైసీపీ, టీడీపీ బాహాబాహి

వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఉద్రిక్తం 


వన్‌టౌన్‌, అక్టోబరు 20 : వైసీపీ - టీడీపీ కార్యకర్తలు బాహాబాహీ తలపడడంతో బుధవారం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయాలపైన, ఆ పార్టీ నాయకుడు పట్టాభి నివాసంపైన వైసీపీ దాడులను నిరసిస్తూ బంద్‌ను విజయవంతం చేయడానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను, టీడీపీ సీనియర్‌ నాయకుడు కొట్టేటి హనుమంతరావు, ఎస్‌.ఏడుకొండలు తదితరులను పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత కొద్దిసేపటికి దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పైలా సోమినాయుడు, తంగెళ్ల రాము తదితరులు అదే స్టేషన్‌కు చేరుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైసీపీ నాయకులు స్టేషన్‌ ప్రాంగణంలోనే మీడియాతో మాట్లాడారు. ముందుగా సోమినాయుడు  చంద్రబాబును, లోకేశ్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు డూండీ రాకేష్‌, హనుమంతరావు, ఏడుకొండలు, రమణమ్మ తదితరులు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో తంగెళ్ల రాము వారిపై రాయి విసరడంతో ఇరువర్గాల మధ్యా తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అదికాస్తా బాహాబాహీ తలపడేవరకు వెళ్లడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ, పోలీసుల ప్రోద్బలంతోనే వైసీపీ నాయకులు స్టేషన్‌ ఆవరణలో ప్రెస్‌మీట్‌ పెట్టారని, కావాలనే వైసీపీ నాయకులు తమను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఆరోపించారు. 

Updated Date - 2021-10-21T06:53:36+05:30 IST