అర్ధరాత్రి బాహాబాహీ

ABN , First Publish Date - 2021-03-21T05:30:00+05:30 IST

అర్ధరాత్రి బాహాబాహీ

అర్ధరాత్రి బాహాబాహీ
ఎన్టీటీపీఎస్‌ వద్ద బూడిద చెరువు

ఎన్టీటీపీఎస్‌ బూడిద చెరువు వద్ద వైసీపీ నేతల కొట్లాట

మంత్రి బాలినేని వర్సెస్‌ ఎమ్మెల్యే వసంత అనుచరులు

బూడిద రవాణాపై తలెత్తిన వివాదం

రెండు వర్గాల దాడులు.. పలువురికి గాయాలు

విజయవాడ, మార్చి 21 : ‘ఎమ్మెల్యేగా గెలవటం కోసం రూ.70కోట్లు ఖర్చు చేశాం. పంచాయతీ ఎన్నికల్లో రూ.15 కోట్లు  అయ్యాయి. మేము ఇక్కడ ఇంత ఖర్చు చేస్తే ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ మాకు దక్కాల్సిన కాసులు మీరు ఎగరేసుకుపోతాం అంటే మేము చేతకాని దద్దమ్మల్లా కనిపిస్తున్నామా..’ అంటూ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ బామ్మర్ది అనుచరులు ఎన్టీటీపీఎస్‌ బూడిద చెరువులో శనివారం అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. బూడిద రవాణా చేస్తున్న మైనింగ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వర్గపోరు వల్లే..

ఎన్టీటీపీఎస్‌ బూడిద చెరువు కాసులు కురిపించే కల్పతరువు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా దానికి సంబంధించిన వ్యక్తుల ఆధిపత్యం ఈ బూడిద చెరువుపై ఉంటుంది. ఎన్టీటీపీఎస్‌ నుంచి వచ్చే బూడిదను చెరువుకు తరలిస్తారు. మెరక తోలుకునేందుకు, రహదారుల నిర్మాణాలకు, రైతుల భూముల్లోకి తీసుకెళ్లేందుకు బూడిదకు బాగా డిమాండ్‌ ఉంటుంది. చెరువు నిండకుండా ఉండేందుకు ఎన్టీటీపీఎస్‌ యాజమాన్యం కూడా ఎస్కలేటర్లు పెట్టి లారీలకు ఉచితంగా లోడింగ్‌ చేస్తుంటుంది. దీనికి ఇటీవల మెగా ఇంజనీరింగ్‌, నవయుగ కాంట్రాక్టు సంస్థలు అనుమతులు తీసుకోవటంతో కాంట్రాక్టులు దక్కించుకున్న వ్యక్తులు బూడిద రవాణా కోసం ప్రత్యేకంగా ఎస్కలేటర్లు పెట్టుకున్నారు. కాంట్రాక్టు సంస్థలకు రవాణా చేసే ముసుగులో బయటి సంస్థలకు కూడా పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రవాణాను బట్టీ ఒక్కో లారీ రూ.4వేల నుంచి రూ.6వేలు ఉంటుంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బామ్మర్ది కన్ను పడింది. అంతకుముందు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుని బూడిద రవాణా చేస్తున్నారు. దీనిని స్థానిక ఎమ్మెల్యే వసంత అనుచరులు అడ్డగించి సొంతం చేసుకున్నారు. ఆ తరువాత మంత్రి అనుచరులు నవయుగ కాంట్రాక్టు సంస్థ పేరుతో కాంట్రాక్టు దక్కించుకుని బూడిద రవాణా ప్రారంభించారు. దీంతో ఇరువర్గాలు ఒకేచోట ఉంటే ఘర్షణలు జరుగుతాయనే ఉద్దేశంతో ఎన్టీటీపీఎస్‌ యాజమాన్యం.. ఎమ్మెల్యే అనుచరులకు బూడిద చెరువు, మంత్రి అనుచరులకు ట్రక్‌ టెర్మినల్‌ ప్రాంతాలను కేటాయించింది. అయితే, మంత్రి అనుచరులకు కేటాయించిన ప్రాంతం రవాణాకు అనువుగా ఉండటంతో ఎమ్మెల్యే వసంత అనుచరులు పోటీగా వాళ్ల దగ్గర లోడింగ్‌కు వాహనాలు సిద్ధం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే అనుచరులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఇరువర్గాలపై కేసు

బూడిద చెరువులో జరిగిన ఘర్షణకు సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. అప్పారావు, సురేష్‌, గోపీ ఫిర్యాదు మేరకు పచ్చిగోళ్ల రాజు, విజయభాస్కరరెడ్డిపై కేసు నమోదు చేశారు. రాజు, విజయభాస్కరరెడ్డి ఫిర్యాదు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌ కుమార్‌ తెలిపారు.



Updated Date - 2021-03-21T05:30:00+05:30 IST