అక్రమంగా మట్టి తవ్వకాలు

ABN , First Publish Date - 2021-05-18T05:51:34+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు అధికార పార్టీ నాయకులు తెరలేపారు.

అక్రమంగా మట్టి తవ్వకాలు

 పట్టించుకోని అధికారులు

ముసునూరు, మే 17: మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు అధికార పార్టీ నాయకులు తెరలేపారు. ఉన్నతాధికారుల అనుమతులు ఉన్నాయంటూ రాత్రి, పగలు తేడా లేకుండా చెరువుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. సోమవారం చింతలవల్లి, గోపవరం గ్రామాల్లో ఉన్న ఊర చెరువు, చిన్న చెరువుల్లో మట్టిని, ముసునూరులో ఉన్న ఊర చెరువులో గ్రావెల్‌ను ముమ్మరంగా తవ్వేశారు. ఎటువంటి అనుమతులూ లేకుండా ఒక్కొక చెరువులో రెండు నుంచి మూడు ఎక్స్‌కవేటర్లు, ప్రొక్‌లైనర్లు పెట్టి తవ్వకాలు జరుపుతుంటే సంబంధిత అధికారులు కన్నేత్తి కూడా చూడకపోవటంపై గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడి ఇంటి మేరవకు మట్టి కావాలంటే అనేక నిబంధనలు చెబుతారని,  రైతు పొలంలో మట్టి తొలుకోవాలంటే ఇరినేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారుల అనుమతులు కావాలంటూ కొర్రీలు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని, అధికార పార్టీ నాయకులకు మాత్రం ఇవేవీ  వర్తించవా అని అధికారులను గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులకు అధికారులు కొమ్ముకాయటం వల్లే ప్రజావసరాలకు ఉపయోగపడే ప్రకృతి సంపదైన గ్రావెల్‌ అక్రమార్కులకు ఇష్టానుసారంగా తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్నారని, మండలంలో అక్రమ తవ్వకాలు జరుగకుండా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

 మట్టి రవాణాకు అనుమతులు లేవు  

  మండల పరిధిలోని చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు, రవాణాకు ఎటువంటి అనుమతులూ లేవు. మట్టి అక్రమ రవాణా విషయం నా దృష్టికి రాలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్రమ తవ్వకాలను, రవాణాను అడ్డుకుంటాం. 

 - ఎం పాల్‌, తహసీల్దార్‌, ముసునూరు

 


Updated Date - 2021-05-18T05:51:34+05:30 IST