ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-30T05:27:14+05:30 IST

ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

నేటి నుంచి మూడు రోజులు జిల్లాలో వెంకయ్యనాయుడు పర్యటన

ఉంగుటూరు, అక్టోబరు 29 : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మూడు రోజుల జిల్లా పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నివాస్‌ అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌, గన్నవరం మండలం చిన అవుటపల్లిలోని డాక్టర్‌ పిన్నమనేని ఆసుపత్రిలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం  విమానాశ్రయం చేరుకుంటారని, అక్కడి నుంచి ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టుకు వెళ్తారని, సాయంత్రం 4 గంటలకు ట్రస్టులో జరిగే రైతునేస్తం మాసపత్రిక వార్షికోత్సవంలో పాల్గొని రైతులకు పురస్కారాలను అందిస్తారని తెలిపారు. ఇందులో వివిధ రాష్ట్రాల రైతులు పాల్గొనే అవకాశం ఉన్నందున రైతులకు, వాహనాల పార్కింగ్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఆదివారం విజయవాడలోని రామ్మో  హన్‌ గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారని, సోమవారం చిన అవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభించి, విద్యార్థులు, అధ్యాపకులతో భేటీ అవుతారని వివరించారు. మంగళవారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి, డీసీపీ విక్రాంత్‌పాటిల్‌, ఏసీపీ విజయ్‌పాల్‌, ఉంగుటూరు తహసీల్దార్‌, డి.వనజాక్షి, ఎంపీడీవో కె.జ్యోతి, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ పరదేశి, గన్నవరం సీఐ కె.శివాజీ పాల్గొన్నారు.

గృహహక్కు సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయండి

పాయకాపురం : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌) సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ నివాస్‌ స్పష్టం చేశారు. ఈ పథకం సర్వే, డేటా ఎంట్రీ అంశాలపై క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారుల వద్ద డాక్యుమెంట్లు లేకపోతే ఆ వివరాలను హౌసింగ్‌ అధికారుల నుంచి పొందాలే తప్ప సర్వే, డేటా ఎంట్రీలో జాప్యం చేసేందుకు వీల్లేదన్నారు.  ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్లు మాధవీలత, ఎల్‌.శివశంకర్‌, శ్రీనివాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, జడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, డీపీవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:27:14+05:30 IST